Friday, November 22, 2024

IPL | ఢిల్లీ ఐదో ‘సారీ’!.. చెలరేగిన పేసర్లు, కోహ్లీ అర్ధ సెంచరీ

ఐపీఎల్‌-16 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. శనివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపైనా ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో వరుసగా ఐదవసారి పరాభవం మూటగట్టుకుంది. ప్రత్యర్థి విసిరిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక వార్నర్‌ గ్యాంగ్‌ చతికిలబడింది. 56 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఓటమి అంచుల్లోకి నెట్టేశారు. చివరి బంతిదాకా పోరాడిన ఢిల్లి క్యాపిటల్స్‌ 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో 23 పరుగుల తేడాతో ఆర్‌సీబీ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన డుప్లెసిస్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(50) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో రాణించాడు. వన్‌డౌన్‌లో మ్యాక్స్‌వెల్‌ (24), ఆఖర్లో అనుజ్‌ రావత్‌(15), ష#హబాజ్‌ అహ్మద్‌(20) ధాటిగా ఆడడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లి బ్యాటర్లను ఆర్‌సీబీ ప్రారంభంలోనే బెదరగొట్టింది. నిప్పులు చెరిగే బంతులతో టాపార్డర్‌ను హడలెత్తించింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (19) కొద్దిసేపు ప్రతిఘటించినా, పృథ్వీషా (0), మిచెల్‌ మార్ష్‌ (0), యాష్‌ధుల్‌ (10, పోరెల్‌ (5) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీంతో ఒక దశలో 56 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మనీశ్‌పాండే (50), హకీమ్‌ఖాన్‌ (18), అక్షర్‌ (21), ఎన్రిచ్‌ (23) ఎదురొడ్డి పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో ఆఖరు బంతి వరకు పోరాడిన ఢిల్లి క్యాపిటల్స్‌ 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్‌సీబీ బౌలర్లలో విజయ్‌ కుమార్‌ మూడు వికెట్లు, సిరాజ్‌ రెండు వికెట్లు తీయగా, పార్నెల్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

టాస్‌ ఓడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ (50: 34బంతుల్లో), డుప్లెసిస్‌ (22: 16బంతుల్లో) రాణించి శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ జంట 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. జట్టు స్కోరు 89 పరుగుల వద్ద దూకుడుగా ఆడుతున్న కోహ్లీని లలిత్‌యాదవ్‌ బోల్తాకొట్టించాడు. వీరిద్దరు ఔటైన్‌ తర్వాత బెంగళూరు బ్యాటింగ్‌ జోరు తగ్గింది. ఈ దశలో లామ్‌రోర్‌ (26), మ్యాక్స్‌వెల్‌ (24) కొద్దిసేపు మెరుపులు మెరిపించారు. అయితే జట్టుస్కోరు 132 పరుగుల వద్ద డుప్లెసిస్‌ సేనకు ఎదురుదెబ్బ తగిలింది. హర్షల్‌పటేల్‌ (6), మ్యాక్స్‌వెల్‌, కార్తీక్‌ వెంటవెంటనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. కుల్దిప్‌యాదవ్‌, అక్షర్‌పటేల్‌ వరుస ఓవర్లలో ప్రత్యర్థికి షాక్‌ఇచ్చారు.

దీంతో స్కోరువేగం నెమ్మదించింది. ఆఖరులో షాబాద్‌ అహ్మద్‌ (20 నాటౌట్‌), అనుజ్‌ రావత్‌ (15నాటౌట్‌) ప్ర త్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఏడవ వికెట్‌కు వీరిద్దరు విలువైన 42 పరుగులను జోడించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్‌సీబీ 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఢిల్లి బౌలర్లలో కుల్దిప్‌ యాదవ్‌, మిచెల్‌ మార్ష్‌ రెండేసి వికెట్లు తీశారు. అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement