ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో 28 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమ్ఇండియాకు మరోషాక్ తగిలింది. ఈ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు ఐదో స్థానానికి పడిపోయింది.
టీమ్ ఇండియా WTC 2023-25 సైకిల్‌లో ఇప్పటివరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా… రెండు మ్యాచ్‌లు గెలిచి, మరో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో డబ్ల్యూటీసీ 2023-2025 పాయింట్ల పట్టికలో భారత్ 26 పాయింట్లతో 43.33 విజయ శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది.
పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు WTC ఫైనల్స్‌కు చేరుకుంటాయి. అయితే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరుకోవాలంటే టీమ్ ఇండియా ఇంగ్లండ్‌తో జరిగే మిగిలిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది.
ఇక ఈ పట్టికలో ఆస్ట్రేలియా పది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, మూడు ఓటములు, ఒక డ్రాతో 55 విజయాల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు వరుసగా 50 శాతంతో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.