టీమ్ ఇండియా ఆల్ రౌండర్ దీపక్ హుడా ఆడిన ప్రతి మ్యాచ్‌లో అదరగొడుతున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపిఎల్‌లో సత్తా చాటి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న హుడా తాజాగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో హుడా 25 పరుగులు సాధించి ఒక వికెట్‌కూడా పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అం తేకాదు ఈ మ్యాచ్‌తో దీపక్ హుడా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
క్రికెటర్‌గా అరంగ్రేటం చేసిన తర్వాత హుడా ఆడిన 16 మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. హుడా ఇప్పటి వరకు తొమ్మిది టి 20లు, ఏడు వన్డేల్లో టీమ్ ఇండియా తరపున ప్రాతినిద్యం వహించాడు. గతంలో ఈ రికార్డు రొమేనియా ప్లేయర్ సాట్విక్ నడిగోటియా పేరిట ఉండేది. నడి గోటియా ఆరంగేట్రం చేసిన అనంతరం రొమేనియా 15 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. తాజా మ్యాచ్‌తో నడిగోటియా రికార్డును హుడా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను సంజూ శాంసన్, దీపక్ హుడా విజయ తీరాలకు చేర్చారు.