దేశ క్రీడా రంగంలో వివాదాలకు కేంద్రంగా మారిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఎన్నికల ముహూర్తం ఖరారైంది. నాలుగైదు నెలలుగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను డిసెంబర్ 21న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జస్టిస్ (రిటైర్డ్) ఎం.ఎం.కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల పోలింగ్‌తో పాటు ఫలితాలనూ అదే రోజు సాయంత్రం వెల్లడిస్తామని కుమార్ తెలిపారు.
డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను ఈ ఏడాది ఆగస్టు 7న రూపొందించిన ఎన్నికల జాబితా ప్రకారమే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలపై పంజాబ్- హర్యానా హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ (హెడ్డబ్ల్యూఎ), హర్యానా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు వాయిదా పడ్డ విషయం విదితమే. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులు ఆందోళనకు గురికావాల్సిన పన్లేదని.. ఎన్నికలు పాత పద్ధతిలోనే జరుగుతాయని కుమార్ తెలిపారు.