అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది! డారియస్ విస్సర్ విధ్వంసంతో ఒకే ఓవర్‌లో 39 పరుగులు వచ్చాయి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయిర్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన సమోవా వర్సెస్ వనాటు మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది.
సమోవా బ్యాటర్ డారియస్ విస్సర్.. నిపికో బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. అంతేగాక నిపికో మూడు నోబాల్స్ వేయడంతో మొత్తంగా 39 పరుగులు వచ్చాయి. డారియస్ తొలి మూడు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ తర్వాత నిపికో నోబాల్ వేశాడు. ఫ్రీహిట్‌ను సిక్సర్‌గా మలిచిన డారియస్ చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా బాదాడు. దీంతో యువరాజ్ సింగ్ ఊచకోత రికార్డు బద్దలైంది.
అంతకుముందు వరకు ఓ ఓవర్‌లో 36 పరుగులే అత్యధికం. 2007 టీ20 వరల్డ్ కప్‌లో యువీ ఆరు సిక్సర్లు బాది ఈ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత యువరాజ్ రికార్డును కీరన్ పొలార్డ్ (2021), నికోలస్ పూరన్ (2024), దిపేందర్ సింగ్ (2024), రోహిత్ శర్మ-రింకూ సింగ్ (2024) సమం చేశారు. తాజాగా ఈ అరుదైన రికార్డును 28 ఏళ్ల డారియస్ విస్సర్ బ్రేక్ చేశాడు.
విస్సర్ 62 బంతుల్లో 132 పరుగులు చేశాడు. 14 సిక్సర్లు బాదాడు. కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సమోవా 2026 టీ20 వరల్డ్ కప్ అర్హతకు అవకాశాలను మెరుగుపర్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో వనాటు తొమ్మిది వికెట్లు కోల్పోయి 169 పరుగులకు పరిమితమైంది. విస్సర్ సెంచరీతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టాడు.