హైదరాబాద్: ఇటీవల నిర్వహించిన వేలంలో తెలంగాణ హోం టీమ్ సన్ రైజర్స్ ఒక్క హైదరాబాదీకి కూడా స్థానం కల్పించలేదు.. దీనిపై ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు అటగాళ్లు ఐపిఎల్ కు ఎంపిక కాగా, వారంతా మిగిలిన ప్రాంచైజ్ లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. హోంటీమ్ లో ఒక్క తెలుగు క్రికెటర్ లేకపోవడం పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు..ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ ఆటగాళ్లకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఐపీఎల్‌లో సత్తా చాటే క్రికెటర్లు హైదరాబాద్‌లో చాలా మంది ఉన్నారన్నారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఈ సీజన్ నిర్వహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్పందించాలని డిమాండ్ చేశారు. జట్టులోకి ఒక్క హైదరాబాదీని కూడా తీసుకోకపోవడం సరైంది కాదని, ప్రతిభావంతులైన ప్లేయర్స్ చాలామంది ఉన్నారన్నారు. ఐపీఎల్‌లో వాళ్లు సత్తా చాటగలరన్నారు. బాల్ ట్యాంపరింగ్‌లో దొరికిన డేవిడ్ వార్నర్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్నాడు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement