బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి చేజారింది. దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నమెంట్ ఆరంభానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో బంగ్లాలోని పరిస్థితులను ఐసీసీ కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధికారులు మాట్లాడారు. అయితే బంగ్లాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మెగా టోర్నమెంట్‌ను ప్రత్యామ్నాయ వేదికపై నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇప్పుడిప్పుడే ఉమెన్ క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రిస్క్ తీసుకోవాలని ఐసీసీ అనుకోవడం లేదు. దీంతో భారత్, శ్రీలంక, యూఏఈలను బ్యాకప్ ఆప్షన్స్‌గా ఐసీసీ ఉంచినట్లు సమాచారం.
“బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఆ దేశ భద్రతా ఏజెన్సీలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. అక్కడ పరిస్థితిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆటగాళ్లే భద్రత మా ప్రాధన్యత. అందుకోసం మేము ఈ నిర్ణయం తీసుకోవడానికైనా సిద్దం. ఈ మెగా టోర్నీ నిర్వహణపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని” ఐసీసీ అధికారి ప్రతినిథి ఒకరు పేర్కొన్నారు. కాగా ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి ఆక్టోబర్ 20 వరకు జరగనుంది.