వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వచ్చే సీజన్‌కు కొత్త కోచ్‌గా ఎంపిక చేసుకుంది. తాజాగా బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా ఎంచుకుంటూ సన్ రైజర్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జట్టుకు సలహాదారుగానే కాకుండా బ్యాటింగ్ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను కొత్తగా హెడ్ కోచ్‌గా నియమించుకున్నట్లు ఆ జట్టు శనివారం ప్రకటించింది.
గత సీజన్ వరకు ప్రధాన కోచ్‌గా కొనసాగిన ఆసీస్ దిగ్గజం టామ్ మూడీని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించింది. అంతేకాకుండా మూడీ సేవలను కీర్తిస్తూ ఆయనకు పూర్తి స్థాయిలో వీడ్కోలు పలికింది. వాస్తవానికి టామ్ మూడీ కోచ్‌గా ఉన్న 2013-19 మధ్య కాలంలోనే హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌లో సత్తా చాటింది. మూడీ మార్గదర్శకత్వంలోనే 2016లో జట్టు ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది. 2020లో మూడీని జట్టు డైరెక్టర్‌గా తీసుకున్న సన్ రైజర్స్… ఆయన స్థానంలో జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంచుకుంది. లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో జట్టు పెద్దగా రాణించకపోయేసరికి… గతేడాది తిరిగి లక్ష్మణ్ స్థానంలో మూడీని జట్టు హెడ్ కోచ్‌గా ఎంచుకుంది. అయినా కూడా గత సీజన్‌లో సన్ రైజర్స్ పేలవ ప్రదర్శనతో 8వ స్థానంలో నిలిచింది.