- రాష్ట్ర వ్యాప్తంగా 13 జట్లు రాక
- ముస్తాబు అవుతున్న ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం
- విజేతలకు రూ.6 లక్షల వరకు నగదు ప్రోత్సాహాకాలు, ట్రోఫీలు
గుంటూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఓ వైపు పెద్ద పండుగ సంక్రాంతికి రాష్ట్రం వ్యాప్తంగా సిద్ధం అవుతుంటే… మంగళగిరి మాత్రం మెగా క్రీడా సంబరానికి సర్వంగ సుందరంగా ముస్తాబు అవుతోంది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖామాత్యులు, మంగళగిరి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ ఆధ్వర్యంలో మంగళగిరి ప్రీమియర్ లీగ్(ఎంపీయల్) పేరుతో అతిపెద్ద క్రికెట్ పండుగను నిర్వహిస్తున్నారు.
ఈ నెల 12 నుంచి 23వ తేది వరకు 12 రోజుల పాటు ఈ క్రికెట్ పండుగ క్రీడా ప్రేమికులను ఉర్రూతలూగించనుంది. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఆమేరకు ఇప్పటికే స్టేడియంను ముస్తాబు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల నుంచి 13 టీమ్‌లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. మంగళగిరి నియోజకవర్గం టీమ్ వీటికి అదనం. అంటే మొత్తం 14 టీమ్‌లు పోటీ పడుతున్నాయి.
నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయికి….
నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తుండేవారు. ఇప్పటికే రెండు సార్లు ఈ పోటీలను నిర్వహించారు. గతంలో నియోజకవర్గం స్థాయికే పరిమితం అయిన ఈ పోటీలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) సహకారంతో ఈ ఏడాది నుంచి రాష్ట్ర స్థాయికి విస్తరించారు. మంగళగిరి టీమ్‌తో పాటు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కొ టీమ్ పాల్గొనేలా ఏసీఏ సహకారం అందిస్తోంది. ఆమేరకు ఇప్పటికే టీమ్‌ల సెలక్షన్స్ పూర్తి అయింది. వయస్సుతో పనిలేకుండ ఆయా జిల్లాల్లో ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేసి ఒక టీమ్‌గా ఆయా జిల్లాల తరుపున ఈ టీమ్‌లు ఈ లీగ్‌లో పాల్గొంటాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలను మంగళగిరిలో లోకేష్ టీం దగ్గరుండి చూసుకోనుంది.
రోజుకు రెండు చొప్పున…12 రోజుల పాటు పోటీలు…
మంగళగిరి ప్రీమియర్ లీగ్ పోటీల్లో పాల్గొనే 14 జట్లు ఆయా జిల్లాల్లో ఇప్పటికే ముమ్మర సాధన చేస్తున్నారు. అంతర్జాతీయ స్టేడియంలో ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి చొప్పున రోజుకు రెండు మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. 12 వ తేదిన ఉదయం 9 గంటలకు స్టేడియంలో ఈ పోటీలను ప్రముఖులు చేతుల మీదుగా ప్రారంభిస్తారు. 12 రోజుల పాటు సాగే ఈ పోటీలు 23న ఫైనల్ జరుగుతుంది. ఆ రోజు మంత్రి లోకేష్ పుట్టినరోజు. ముగింపు వేడుకలను సైతం స్టేడియంలోనే జరుగుతాయి.
విజేతలకు రూ.6 లక్షల నగదు ప్రోత్సాహాకాలు…
ఎంపీయల్ విజేతలకు భారీ నగదు బహుమతులు అందుకోనున్నారు. విజేతకు రూ.3 లక్షలు, రన్నర్‌కు రూ.2 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.లక్ష నగదు అందిస్తారు. ఈ నగదు బహుమతులతో పాటు ఆకర్షణీయమైన ట్రోఫీలను సైతం విజేతలకు అందిస్తారు.
ఆకట్టుకుంటున్న భారీ ప్రచార హోర్డింగ్‌లు…
మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ అతిపెద్ద క్రికెట్ పండుగకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రచారం చేస్తున్నారు. వివిధ నగరాల్లోని సర్కిల్స్‌లో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మంగళగిరి టీమ్ ముమ్మర సాధన….
13 ఉమ్మడి 13 జిల్లాల టీమ్‌లతో పాటు మంగళగిరి నియోజకవర్గం టీమ్ కూడా ఈ లీగ్‌లో పాల్గొంటుంది. గతేడాది అక్టోబర్‌లో స్థానికులైన వారికి నియోజకవర్గం వ్యాప్తంగా అంతర్గత పోటీలు నిర్వహించారు. అందులో ప్రతిభ చూపిన 33 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వారు ప్రతి రోజు మంగళగిరి స్డేడియం వద్ద ముమ్మర సాధన చేస్తున్నారు. ఇప్పటికే వారితో కలిసి లోకేష్ కూడా సరదాగా బ్యాటింగ్ ప్రాక్టీసు చేశారు.
యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకే….
ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకే మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో అతిపెద్ద క్రికెట్ పండుగను నిర్వహిస్తున్నాం. గతంలో మంగళగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. అద్భుత నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించాం. అందుకే ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలల్లో అంతర్గత పోటీలను నిర్వహించి, అందులో నుంచి ఉత్తమ ప్రతిభ చూపిన వారితో జిల్లాకు ఒక టీమ్ చొప్పున సెలక్ట్ చేశారు. ఇలా 13 టీమ్‌లు వస్తున్నాయి. వాటితో పాటు మంగళగిరి నియోజకవర్గం టీమ్ కూడా ఉంటుంది. విజేతలను ప్రోత్సాహించేందుకు రూ.6 లక్షల వరకు నగదు ప్రోత్సాహాకాలను అందిస్తున్నాం”అని అన్నారు.