హైదరాబాద్: దేశీయ విమానరంగం అభివృద్ధిలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పాత్ర చాలా విలువైనదని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు అన్నారు. బుధవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఏఓసీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆలిండియా ఏఏఐ ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి జగన్‌మోహన్‌రావు ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈనెల 7వ తేదీ వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది ఏఏఐ టీమ్‌లు తలపడతున్నాయి.
పోటీల ప్రారంభానికి ముందు ఏఏఐ సిబ్బంది గౌరవ వందనాన్నీ జగన్‌మోహన్ రావు స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ తొలుత దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 18 వేల మంది ఏఏఐ ఉద్యోగులకు హెచ్‌సీఏ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత ఒత్తిడితో కూడిన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూ కూడా సరదాగా కాకుండా క్రికెట్‌ను ఇంత ప్రొఫెషనల్‌గా ఆడుతుండడంతో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు.
ఉప్పల్ స్టేడియం నెట్స్‌లో మీరంతా ప్రాక్టీసు చేస్తుంటే చూశానని, క్రికెట్‌తో మీకున్న అనుబంధం, ఆటపై ఉన్న అంకితభావం చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. ఏఏఐకు క్రికెట్ పరంగా ఎప్పుడు, ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి హెచ్‌సీఏ ముందుంటుందని హామీ ఇచ్చారు. టోర్నీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లుకు ఆల్ ద బెస్ట్ చెప్పాక, నార్త్ జోన్ వర్సెస్‌సెంట్రల్ జోన్ మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించారు. టాస్ ఆనంతరం కొద్దిసేపు ఏఏఐ క్రికెటర్లతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు.
. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ సీఈఓ సునీల్, ఏఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.స్వామినాథన్, ఏఏఐ ట్రేడ్ యూనియన్ జాతీయ అధ్యక్షులు ఎస్.ఆర్ సంతానం, జీఎం ఏఏఐ పీకే హజారీ పాల్గొన్నారు.