సుదీర్ఘ టెన్నిస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న రఫెల్ నాదల్..తనకు బాగా అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆదిలోనే పోరాటాన్ని ముగించాడు. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన నాదల్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయాడు. సోమవారం కోర్ట్ ఫిలిపి చాట్రియర్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో నాదల్ 3-6, 6-7(5-7), 3-6తో జర్మనీ స్టార్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మకటం లేని మహారాజుగా మన్ననలు అందుకున్న నాదల్.
తొలి రౌండ్‌లోనే వైదొలుగడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో మూడు సార్లు టైటిల్ దక్కించుకోకుండానే తన పోరాటాన్ని ముగించాడు.15వేల మంది ప్రేక్షకుల సమక్షంలో స్టేడియంలోకి ప్రవేశించిన నాదల్.. తొలిసారి టోర్నీలో 275 ర్యాంక్‌తో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు కైవసం చేసుకున్న ఈ స్పెయిన్ స్టార్ 38 ఏండ్ల వయసులో గాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
రఫెల్ నాదల్, జ్వెరెవ్ పోరు దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. గాయం నుంచి కోలుకున్నా..జ్వెరెవ్‌కు దీటైన పోటీనివ్వడంలో విఫలమైన నాదల్ వరుస సెట్లలో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. మరోవైపు సుమిత్ నాగల్ (భారత్) తొలి రౌండ్‌లో 2-6, 0-6, 6-7(5-7)తో ఖచనోవ్ చేతిలో ఓడాడు.