టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెస్టిండీస్ వెళ్లనున్నాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే అతను అక్కడికి చేరుకుంటాడని సమచారం. వన్డే వరల్డ్ కప్ జట్టు ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాల గురించి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో అతను చర్చిస్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘సెలెక్షన్ కమిటీలో ఒకడైన సలిల్ అంకోలా ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్నాడు. రెండో టెస్టు పూర్తి కాగానే అతను భారత్‌కు రానున్నాడు.
వన్డే సిరీస్ ఆరంభానికి ముందే అగార్కర్ జట్టుతో కలవనున్నాడు’ అని బీసీసీఐ ప్రతినిధిలు వెల్లడించారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత గడ్డపై అక్టోబర్ 5న మొదలవ్వనుంది. ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏళ్లుగా నిరీక్షిస్తున్న టీమిండియా స్వదేశంలో రెండోసారి కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది. దాంతో బీసీసీఐ ఈ టోర్నమెంట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.