ఈ ఏడాది రష్యాలో జరగాల్సిన 44వ చెస్ ఒలింపియాడ్ ఉక్రెయిన్‌తో వార్ నేపథ్యంలో ఇండియాకి షఫ్ట్ అయ్యింది. 2013లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ తర్వాత దేశంలో జరిగే రెండో అతిపెద్ద గ్లోబల్ ఈవెంట్ చెన్నైలో ఈసారి జరగనుంది. ఈ విషయాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 44వ చెస్ ఒలింపియాడ్‌కు భారతదేశం యొక్క చెస్ క్యాపిటల్ ఆతిథ్యం ఇవ్వబోతున్నందుకు ఆనందంగా ఉంది! తమిళనాడుకు గర్వకారణం! ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజులు, రాణులందరికీ చెన్నై సాదరంగా స్వాగతం పలుకుతోంది! #ChessOlympiad2022,” అని ముఖ్యమంత్రి స్టాలిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతేకాకుండా “ఇది ఇప్పుడు అధికారికం.. భారతదేశం చెన్నైలో 44వ ప్రపంచ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇస్తుంది!” అని ఆల్-ఇండియా చెస్ ఫెడరేషన్ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది. ఆల్-ఇండియా చెస్ సమాఖ్య (AICF) టోర్నమెంట్‌ను నిర్వహించడానికి FIDEకి USD10 మిలియన్ల (సుమారు రూ. 70 కోట్లు) హామీని సమర్పించింది. ఫిబ్రవరి 24న పొరుగున ఉన్న ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఒలింపియాడ్ రష్యాలో జరగకుండా నిలిపేశారు. చెస్ ఒలింపియాడ్ అనేది ద్వైవార్షిక టీమ్ ఈవెంట్. దీనిలో దాదాపు 190 దేశాలకు చెందిన జట్లు రెండు వారాలపాటు పోటీపడతాయి. ఇది మాస్కోలో జూలై 26 నుండి ఆగస్టు 8 వరకు జరగాల్సి ఉంది.
భారతదేశంలో జరిగిన చెస్ ఈవెంట్.. 2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలో విశ్వనాథన్ ఆనంద్, ప్రస్తుత ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్ సెన్ మధ్య పోరు జరిగింది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాలో క్రీడల రద్దుకు పరిస్థితులు దారితీశాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆ దేశంలో ఎలాంటి ఈవెంట్‌లు నిర్వహించకుండా చూసుకోవాలని సభ్య దేశాలను కోరింది.