Friday, September 20, 2024

BCCI | ఐపీఎల్‌లో మార్పులు.. ఇక నుంచి 84 మ్యాచ్‌లు

ఐపీఎల్ 2025 సీజన్‌ను సరికొత్తగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమవుతోంది. ఫ్యాన్స్‌ను మరింత అలరించేలా మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలనుకుంటోంది. ఇప్పటికే ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ.. అందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్దం చేస్తోంది.

మరోవైపు ఈ ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో… రిటెన్షన్ పాలసీ రూపొందించే పనిలో నిమగ్నమైంది. డిసెంబర్‌లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశం నిర్వహించిన బీసీసీఐ.. మెగా వేలానికి సంబంధించిన సలహాలు, సూచనలను స్వీకరించింది. అయితే అప్‌కమింగ్ సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యను పెంచే అవకాశాలపై చర్చలు జరిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఈ నిర్ణయం కార్యరూపందాల్చితే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 84 మ్యాచ్‌లు జరగనున్నాయి. వాస్తవానికి ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌లతో కలిపి మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే రానున్న సీజన్లలో అదనంగా మరో 10 మ్యాచ్‌లు నిర్వహించడంపై బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం. ముందుగా 10 మ్యాచ్‌లను పెంచి ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో మొత్తంగా 84 మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది..

అలాగే, ఐపీఎల్ 2027లో ఈ మ్యాచ్‌ల సంఖ్యను 94కి పెంచనున్నారు. దీంతో 2027లో లీగ్‌ ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2027 సీజన్‌ను లీగ్ ప్రాతిపదికన నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. అంటే అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడతాయి. దీని ద్వారా లీగ్ దశలోనే 90 మ్యాచ్‌లు జరగనున్నాయి.

అయితే ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు. ఐపీఎల్ 2025లో మ్యాచ్‌ల సంఖ్య పెంచబోమని స్పష్టం చేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఆటగాళ్ల పనిభారంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. 10 మ్యాచ్‌లు పెంచినా.. మరో వారం సమయం కావాల్సి వస్తుంది.’ అని జైషా చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement