73వ రిపబ్లిక్‌డే సందర్భంగా కేంద్రం 9మంది అథ్లెట్లకు మంగళవారం పద్మ పురస్కారాలు ప్రకటించింది. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలుతో మెరిసిన భారత అథ్లెట్లుకు పద్మ పురస్కారాల్లో ప్రాధాన్యం లభించింది. 40ఏళ్ల స్టార్ పారాలింపిక్ అథ్లెట్ దేవేంద్ర ఝఝరియాకు దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది. అథెన్స్‌లో జరిగిన 2004పారాలింపిక్స్, రియోలో జరిగిన 2016 పారాలింపిక్స్‌లో దేవేంద్ర జావెలిన్ త్రోలో రెండు బంగారు పతకాలు సాధించాడు. గతేడాది జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో ఎఫ్ 46 ఈవెంట్‌లో దేవేంద్ర రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన గోల్డెన్ జావెలిన్ త్రోయర్ నీరజ్‌కు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. పద్మశ్రీ పురస్కార విజేతల్లో 20ఏళ్ల పారా షూటర్ అవనికి కూడా చోటు లభించింది.
పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న ఇతర అథ్లెట్లలో పారా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్, 93ఏళ్ల కలరిపయట్టు లెజెండ్ శంకర్‌నారాయణ మీనన్, మాజీ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ ఫైజల్ అలీ దార్, 29ఏళ్ల మహిళా హాకీ ప్లేయర్ వందన కటారియా, 67ఏళ్ల మాజీ భారత ఫుట్‌బాల్ కెప్టెన్ బ్రహ్మానంద్ శంకవాల్కర్ పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్నారు. కాగా సైన్యంలో సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్న నీరజ్‌చోప్రా పద్మశ్రీ పురస్కారంతోపాటు పరమ వశిష్ట సేవాపతకం కూడా నేడు అందుకోనున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..