ఐపీఎల్ పదిహేడో సీజన్ ఇంతగా విజయవంతం కావడం వెనుక ఉన్న ‘అన్‌సంగ్ హీరో’లకు భారీ మొత్తం కానుకగా ప్రకటించారు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్లకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున బహుమతిగా అందించనున్నట్లు ఎక్స్ వేదికగా జై షా వెల్లడించారు. ”తాజా టీ20 సీజన్‌ను ఇంతగా సక్సెస్ కావడానికి గ్రౌండ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేయడమూ కారణమే. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతమైన పిచ్‌లను తయారు చేయడంలో వారు సఫలమయ్యారు. అందుకే గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్ల శ్రమను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా ఐపీఎల్ మ్యాచ్‌లు సాగిన 10 వేదికల సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు, అదనంగా సేవలు అందించిన మూడు వేదికల సిబ్బందికి రూ. 10 లక్షల చొప్పున అందజేస్తాం. మీ కఠిన శ్రమ, అంకితభావానికి థాంక్యూ” అని జై షా సోమవారం ట్వీట్ చేశారు.
వేదికలు ఇవే
కాగా ఐపీఎల్-2024 సీజన్‌లో ముంబై(ముంబై ఇండియన్స్), ఢిల్లీ(ఢిల్లీ క్యాపిటల్స్), చెన్నై(చెన్నై సూపర్ కింగ్స్), కోల్‌కతా(కోల్‌కతా నైట్ రైడర్స్), చండీఘర్(పంజాబ్ కింగ్స్), హైదరాబాద్(సన్‌రైజర్స్), బెంగళూరు(ఆర్సీబీ), లక్నో(లక్నో సూపర్ జెయింట్స్), అహ్మదాబాద్(గుజరాత్ టైటాన్స్), జైపూర్(రాజస్తాన్ రాయల్స్)లలో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు జరగగా.. గువాహటి(రాజస్తాన్ రాయల్స్), విశాఖపట్నం(ఢిల్లీ క్యాపిటల్స్), ధర్మశాల(పంజాబ్ కింగ్స్) మైదానాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించారు.