ప్రభన్యూస్ : భారత మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో యమగూచిపై విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. శుక్రవారం గ్రూప్ చివరిమ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్న సింధు ఒక్కరోజులోనే పుంజుకుని టైటిల్ రేసులోకి దూసుకువచ్చింది. హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో సింధు జపాన్ స్టార్ షట్లర్ యమగూచిపై 2-1 (21-15, 15-21, 21-19) తేడాతో గెలుపొందింది. సింధు ఈ టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించడం ఇది మూడోసారి.
2018లో టైటిల్ గెలిచిన సింధు ఈ ఘనత సాధించిన ఏకైక భారత షట్లర్‌గా నిలిచింది. ప్రపంచ నంబర్ 7 సింధు ఈ విజయంతో ప్రపంచ నంబర్ 3 యమగూచితో గెలుపు ఓటముల రికార్డును 12-8తో మెరుగుపరుచుకుంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు ముందు సింధు చివరి మూడు ఈవెంట్స్ ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్‌లో సెమీస్ నుంచే నిష్క్రమించింది. మార్చిలో జరిగిన స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. కాగా ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో సింధు దక్షిణకొరియాకు చెందిన సియోంగ్‌తో తలపడనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital