Friday, November 22, 2024

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌టూర్‌ ఫైనల్స్‌.. సింధుకు రజతం

ప్ర‌భ‌న్యూస్ : భారత మహిళా స్టార్‌ షట్లర్‌, డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ మహిళల సింగిల్స్‌లో రజతాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో సింధు దక్షిణకొరియాకు చెందిన సియాంగ్‌తో తలపడింది. కేవలం 39నిమిషాలపాటు జరిగిన తుదిపోరులో సింధు ప్రపంచ 6వ ర్యాంక్‌ షట్లర్‌ కొరియన్‌ టీనేజ్‌ సంచలనం యాన్‌ సియాంగ్‌ చేతిలో 16-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలైంది. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ఇప్పటివరకు మూడుసార్లు టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ సింధు చివరిసారిగా 2018లో విజేతగా నిలిచింది. 2018లో టైటిల్‌ గెలిచిన సింధు ఈ ఘనత సాధించిన ఏకైక భారత షట్లర్‌గా కొనసాగుతుంది. సెమీఫైనల్లో సింధు జపాన్‌ స్టార్‌ షట్లర్‌ యమగూచిపై 2-1 (21-15, 15-21, 21-19) తేడాతో గెలుపొంది తుదిపోరుకు చేరుకుంది.

అయితే టైటిల్‌పోరులో పరాజయంతో రజతంతో సరిపెట్టుకుంది. ఇండోనేషియా మాస్టర్స్‌, ఇండోనేషియా ఓపెన్‌లో వరుస టైటిళ్లతో ఛాంపియన్‌గా నిలిచిన సియాంగ్‌ సీజన్‌ ముగింపు టోర్నీలోనూ విన్నర్‌గా నిలిచింది. అక్టోబర్‌లో జరిగిన డెన్మార్క్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో సియాంగ్‌ సింధును ఓడించింది. కాగా మార్చిలో జరిగిన స్విస్‌ ఓపెన్‌లో సింధు రన్నరప్‌గా నిలిచింది. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు ముందు సింధు చివరి మూడు ఈవెంట్స్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఇండోనేసియా మాస్టర్స్‌, ఇండోనేసియా ఓపెన్‌లో సెమీస్‌ నుంచే నిష్క్రమించింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement