ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. స్టార్టింగ్‌లో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన జట్టును రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) హీరోచిత పోరాటంతో ఆదుకున్నారు. తొలి రోజులోనే పంత్ సెంచరీతో అదరగొట్టగా.. రెండో రోజు జడేజా సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే.. ఆ తర్వాత కాసేపటికే అతను పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో కెప్టెన్ బుమ్రా (16 బంతుల్లో 31 నాటౌట్) చెలరేగి ఆడాడు.
ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. బ్రాడ్ వేసిన ఒక నోబాల్‌ను బుమ్రా సిక్సర్ బాదగా.. మరొక వైడ్ బౌండరీ వెళ్లింది. దాంతో ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 35 పరుగులు వచ్చాయి. టెస్టు క్రికెట్‌లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బుమ్రా నిలిచాడు.
ఇక.. జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మహమ్మద్ సిరాజ్ (2) మిడాఫ్‌లో ఉన్న బ్రాడ్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. పంత్, జడేజాతోపాటు చివర్లో బుమ్రా ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత జట్టు 416 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. మాథ్యూ పాట్స్ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్, స్టోక్స్, రూట్ తలో వికెట్ తీసుకున్నారు.