ఆసియా గేమ్స్ కాంస్య విజేత గుల్వీర్‌సింగ్ మరోమారు సత్తాచాటాడు. కాలిఫోర్నియా వేదికగా పారిస్ ఒలింపిక్స్ అర్హత టోర్నీలో గుల్వీర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పురుషుల 10,000 మీటర్ల రేసును గుల్వీర్ 27.41.81 సెకన్ల టైమింగ్‌తో ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 16 ఏండ్ల క్రితం సురేంద్రసింగ్ నెలకొల్పిన రికార్డు (28.02.89సె)ను గుల్వీర్ అధిగమించాడు.
20 సెకన్ల తేడాతో కొత్త రికార్డు అందుకున్న గుల్వీర్ పారిస్ ఒలింపిక్స్ అర్హత టైమింగ్ (27.00.00)ను అందుకోలేకపోయాడు. మరోవైపు భారత్‌కే చెందిన కార్తీక్‌కుమార్ (28.01.90 సె) తొమ్మిదో స్థానంలో నిలువగా, అవినాశ్ సాబ్లే 6వేల మార్క్ వద్ద పరుగును ముగించాడు. మహిళల విభాగంలో పారుల్ చౌదరీ (32.02.08) పారిస్ విశ్వక్రీడలకు అర్హత సాధించలేకపోయింది.