ముంబై: మూడో ప్రపంచకప్ ట్రోఫీయే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ ఇప్పుడు తమ కళను సహకారం చేసుకునేందుకు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశను అజేయంగా (9/9)తో ముగించి ఇప్పుడు సెమీస్ పోరుకు సిద్ధమైంది. నేడు వాంఖడే వేదికగా జరిగే తొలి సెమీస్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఒక్క ఓటమిని కూడా ఎరుగని రోహిత్ సేన రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. గత 2019 వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన భారత్ ఈసారి ప్రతికార రెచ్చతో మైదానంలో అడుగుపెడుతోంది. ఇప్పుడు ఆ ఘోర అవమనానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అన్ని విధాలుగా రెడీ అయింది.
ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా లీగ్ దశలో అన్ని జట్లను ఓడించి నాకౌట్‌లో అజేయంగా అడుగుపెట్టింది. గత వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగులతో ఓడిన భారత్ ఈసారి లీగ్ దశలో కివీస్‌ను 4 వికెట్లతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ నిర్ధేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 12 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (95) సత్తా చాటుకోగా.. బౌలింగ్‌లో మహ్మద్ షమీ 5 వికెట్లతో కవీస్‌ను కట్టడి చేశాడు. ఇక నాకౌట్ పోరులో భారత్ మరోసారి విలియమ్సన్ సేనను ఢీ కొననుంది. లీగ్ దశలో ఇతర జట్లపై ఏకపక్ష, భారీ విజయాలు సాధించిన టీమిండియా కివీస్‌పై మాత్రం పోరాడి గెలిచింది. విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రపంచకప్ సమరాల్లో కివీస్ వరుసగా 9వ సారి సెమీస్‌కు చేరుకొని సత్తా చాటుకుంది. మరోవైపు భారత్ ఓవరాల్‌గా 8వ సారి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే పిచ్‌పై ముందు బ్యాటింగ్ చేసిన జట్టుకు ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయని విశ్లేషకుల అంచనా.. అందుకే ఈ మ్యాచ్‌లో టాస్ కూడా కీలకంగా మారనుంది. టాస్ గెలిచే జట్టు కచ్చితంగా తొలుత బ్యాటింగ్ తీసుకుంటుంది.
అన్ని విభాగాల్లోనూ టీమిండియా నెం.1..
ఇక ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అద్భుత ఫామ్‌లో ఉంది. ఫీల్డింగ్‌లోనూ భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఓవరాల్‌గా అన్ని విభాగాల్లో భారత్ నెంబర్-1 జట్టుగా కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ 9 మ్యాచుల్లో 99 సగటుతో 594 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగు తున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ (503) పరుగులతో పాటు అద్భుత కెప్టెన్సీతో టీమిండియాకు ముందుండి నడిపిస్తు న్నాడు. ఇతర బ్యాటర్‌లలో శ్రేయస్ అయ్యర్ (421), కేఎల్ రాహుల్ (347), ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (270) కూడా పర్వాలేదనిపిస్తున్నారు. కీలక సమయాల్లో రాణించి విజయాల్లో తమవంతు సహకారం అందిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలతో టీమిండియా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భారత పేసర్ల త్రయం సూపర్ ఫామ్‌లో ఉంది. టోర్నీ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన మహ్మద్ షమీ ఇప్పుడు విధ్వంసాలు సృష్టిస్తున్నాడు.16 వికెట్లు పడగొట్టి సత్తా చాటుకున్నాడు. మరోవైపు ప్రధాన పేసర్ బుమ్రా 17 వికెట్లతో భారత టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. ఇక హైదరాబాదీ సిరాజ్ కూడా పదునైన బంతులతో ప్రత్యర్థి జట్లను వణికిస్తున్నాడు. ఆరంభంలో కాస్తా ఇబ్బంది పడ్డ వరల్డ్ నెం.1 సిరాజ్ ఇప్పుడు మళ్లి ఫామ్‌ను అందుకున్నాడు. ఇక స్పిన్నర్లు రవీంద్ర జడేజా (16 వికెట్లు), కుల్దిప్ యాదవ్ (14 వికెట్లు) మ్యాజిక్ చేస్తున్నారు. ఓవరాల్‌గా భారత్‌ను ఎదుర్కొవడం ఈసారి కివీస్‌కి కూడా పెద్ద సవాలే.
కివీస్‌ను తక్కువ అంచనా వేయలేం..
నాలుగో జట్టుగా నాకౌట్‌కు చేరిన న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. గత రెండు ఏడిషన్‌లలో కివీస్ జట్టు రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు 2007 నుంచి ఈ బ్లాక్ క్యాప్స్ జట్టు వరుసగా సెమీస్‌లో అడుగుపెడుతోంది. 2019 ఫైనల్లో ఇంగ్లండ్‌తో పోరాడి ఓడింది. ఇక ఈ ప్రపంచకప్‌లో మంచి ఆరంభాన్ని అందుకున్న కివీస్ తర్వాత భారత్‌తో పాటు వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలై కష్టాల్లో పడింది. కానీ కీలక మ్యాచ్‌లో మాత్రం శ్రీలంకను చిత్తుగా ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సారథి కేన్ విలియమ్సన్ ఇప్పుడు మళ్లి జట్టులో చేరడం కివీస్‌కు పెద్ద ప్లస్ పాయింట్. ఓపెనర్ రచిన్ రవీంద్ర (565) అద్భత ఫామ్‌లో ఉండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం. డారిల్ మిచెల్, కాన్వే, లాథమ్, విలియమ్సన్‌లు కూడా బ్యాట్‌తో సత్తా చాటుతున్నారు. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ ఎలాంటి బ్యాటింగ్ లైనప్‌ను కూడా పడగొట్టగలరు.మొత్తంగా న్యూజిలాండ్ కూడా అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉంది. భారత్‌కు గట్టి సవాల్ విసిరేందుకు రెడీ గా ఉంది. జట్లు అంచనా:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దిప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: డేవొన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలి యమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికె ట్ కీపర్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మాన్, మిచెల్ సాం ట్నర్, టిమ్ సౌథీ, లూకీ ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్.