Friday, November 22, 2024

Big story : వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో నీరజ్‌కు రజతం.. విశ్వ వేదికపై మరోసారి చరిత్ర సృష్టించిన చోప్రా

ఒరెగాన్‌: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్‌లో తన నాల్గో ప్రయత్నంతో 88.13 మీటర్ల బ్రెస్ట్‌ త్రో రెండో స్థానంలో నిలిచాడు. గ్రూప్‌-ఏ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో తొలి ప్రయత్నంలో 88.39 మీటర్ల దూరం బరిసె విసిరి నేరుగా పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్‌… నాలుగో ప్రయత్నంలో 88.13మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే గ్రెనడా ఆటగాడు అండర్సన్‌ పీటర్స్‌ 90.54 మీటర్ల బెస్ట్‌ త్రోతో స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. పీటర్స్‌ తన మొదటి ప్రయత్నంలో 90.21 మీటర్లు విసిరి, ఆపై తన రెండో ప్రయత్నంలో 90.46 మీటర్లతో మెరుగ్గా నిలిచాడు. ఆయన తన ఆరో ప్రయత్నంలో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్‌ వడ్లెజ్ఛ్‌ 88.09 మీటర్ల బెస్ట్‌ త్రోతో కాంస్యం గెలుచుకున్నాడు. జర్మనీకి చెందిన జూలియన్‌ వెబర్‌ 86.86 మీటర్ల బెస్ట్‌ ప్రయత్నంతో 4వ స్థానంలో నిలిచాడు. 2003లో కాంస్యం గెలిచిన లాంగ్‌ జంపర్‌ అంజు బాబీ జార్జ్‌ తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండవ భారతీయుడిగా నీరజ్‌ చోప్రా చరిత్ర నెలకొల్పాడు. నీరజ్‌ చోప్రా ఫౌల్‌ త్రో తో తన ఆట ప్రారంభించాడు. తన రెండో ప్రయత్నంతో 82.39 మీటర్ల దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరి కొంచెం మెరుగుపడ్డాడు. కానీ నాల్గో ప్రయత్నంతో 88.13 మీటర్ల త్రోను విసిరి ఏకంగా నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. చోప్రా ఐదో, ఆరో ప్రయత్నాలు ఫౌల్‌ త్రోలు అయ్యాయి. అయినా రెండో స్థానంలోనే నిలిచి… చరిత్ర సృష్టించాడు.
మరో భారత జావెలిన్‌ త్రోయర్‌ రోహిత్‌ యాదవ్‌ ఆకట్టుకోలేకపోయాడు. మూడు రౌండ్ల తర్వాత పదో స్థానంలో నిలిచి టోర్నీ నిష్క్రమించాడు. రోహిత్‌ అత్యుత్తమ ప్రదర్శన 78.72 మీటర్లు మాత్రమే.

ట్రిపుల్‌ జంప్‌లో నిరాశపరిచిన ఎల్డోస్‌పాల్‌
మరోవైపు పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఫైనల్‌లో భారత అథ్లెట్‌ ఎల్డోస్‌పాల్‌ నిరాశపరిచాడు. 9వ స్థానంలో నిలిచి, పతకం తేలేకపోయాడు. 16.79 మీటర్ల దూరం దూకడం ఎల్డోస్‌ అత్యుత్తమ ప్రదర్శన. మొదటి మూడు రౌండ్లు ముగిసేసరికి 9వ స్థానంలో నిలిచిన ఎల్డోస్‌, మరో మూడు అవకాశాలను దక్కించుకోలేకపోయాడు. అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన భారత తొలి అథ్లెట్‌ పాల్‌ కావడం విశేషం. 4ఇంటు400 రిలే టీం విభాగంలో భారత్‌ 12వ స్థానంతో ముగించింది.

అన్ని టోర్నీల్లోనూ పతకం గెలిచిన రికార్డు చోప్రాదే
నీరజ్‌ చోప్రా… ఇప్పుడు భారత క్రీడా ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు… టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి క్రేజ్‌ దక్కించుకున్న జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా. తాజాగా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. ఈ విజయంతో అథ్లెటిక్స్‌ అన్ని పోటీల్లో పతకం గెలిచిన భారత అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. 2009 తర్వాత ఒలింపిక్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలు రెండింటినీ గెలుచుకున్న అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా రికార్డులకెక్కాడు. 2013 వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్స్‌లో కెరీర్‌ మొదలెట్టిన నీరజ్‌ చోప్రా, తన తొలి అంతర్జాతీయ టోర్నీలో 66.75 మీటర్లు విసిరి 19వ స్థానానికి పరిమితమయ్‌యడు. 2015లో జరిగిన ఏసియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో 70.50 మీటర్లు విసిరిన నీరజ్‌ చోప్రా 9వ స్థానానికి పరిమితమయ్యాడు. 2016 నుంచి నీరజ్‌ చోప్రా కెరీర్‌లో ”స్వర్ణ” యుగం మొదలైంది. గువహటిలో జరిగిన సౌత్‌ ఏసియన్‌ గేమ్స్‌లో 82.23 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచిన నీరజ్‌ చోప్రా… అదే ఏడాది వియత్నాంలో జరిగిన ఏసియన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 77.60 మీటర్లు విసిరి రజతం సాధించాడు. పోలాండ్‌లో జరిగిన 2016 వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అండర్‌-20 చాంపియన్‌షిప్స్‌లో 86.48 మీటర్లు విసిరి, స్వర్ణం గెలిచిన నీరజ్‌ చోప్రా, వరల్డ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు.

2017లో చైనాలో జరిగిన ఏసియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ సిరీస్‌లో రెండు రజతాలు గెలిచిన నీరజ్‌ చోప్రా, ఓ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. అదే ఏడాది ఏసియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో 85.23 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచిన నీరజ్‌ చోప్రా, ఫ్రాన్స్‌లో జరిగిన డైమండ్‌ లీగ్‌లో 7, 15 స్థానాల్లో నిలిచి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే ఆతర్వాతి ఏడాది ఆఫెన్‌బర్గ్‌ స్పీర్‌వుర్ఫ్‌ మీటింగ్‌లో నీరజ్‌ రజతం గెలిచాడు. 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో 86.47 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. అదే ఏడాది డైమండ్‌ లీగ్‌లో 87.43 మీటర్లువ ఇసిరినా నాలుగో స్థానంలో నిలిచి, తృటిలో పతకం చేజార్చుకున్నాడు.
ఫ్రాన్స్‌లో జరిగిన సొట్టెవిల్లే అథ్లెటిక్స్‌ మీట్‌లో, ఫిన్‌లాండ్‌లో జరిగిన సావోగేమ్స్‌లో చోప్రా స్వర్ణం గెలిచాడు. ఏసియన్‌ గేమ్స్‌ 2018లో 88.06 మీటర్లు విసిరి సరికొత్త రికార్డులతో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. 2020 ఒలింపిక్స్‌కి అర్హత పోటీలుగా సౌతాఫ్రికాలో జరిగిన అథ్లెటిక్స్‌ సెంట్రల్‌ నార్త్‌ వెస్ట్‌ లీగ్‌ మీటింగ్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్‌ చోప్రా, పోర్చుగల్‌లో జరిగిన మీటింగ్‌ సీడెడ్‌ డి లిసోబా, స్వీడెన్‌లో జరిగిన ఫోల్క్‌సామ్‌ గ్రాండ్‌ప్రిక్స్‌లో స్వర్ణం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌ 2020లో 87.58 మీటర్ల దూరం విసిరి చోప్రా స్వర్ణం సాధించాడు. పావో నుర్మి గేమ్స్‌లో 89.30 మీటర్ల దూరం విసిరి కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. అయితే ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌ చోప్రా, ఫిన్‌లాండ్‌లో జరిగిన కోర్టెన్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. రెండుసార్లు మెడల్స్‌ మిస్‌ అయిన డైమండ్‌ లీగ్‌లో 89.94 మీటర్లతో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసిన నీరజ్‌ చోప్రా… రెండో స్థానంలో నిలిచి రజతం చేజిక్కించుకున్నాడు. తాజాగా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో పతకంతో అథ్లెటిక్స్‌లో మేజర్‌ ఈవెంట్స్‌ అన్నింటిలో పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశాడు.

90మీటర్ల త్రో త్వరలో చూస్తారు! ప్రస్తుతం దానిపైనే దృష్టి కేంద్రీకరించా: నీరజ్‌ చోప్రా
వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజతం పతకం చేజిక్కించుకున్న నీరజ్‌ చోప్రా… మీడియాతో మాట్లాడుతూ… ప్రతిసారీ 90మీటర్ల మార్క్‌ దాటాలనే ప్రయత్నం చేస్తున్నా… దానికి సంబంధించి ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రతిసారీ స్వర్ణం గెలవలేను, కానీ ఆ పతకం సాధించేందుకు చేయగలిగింది చేస్తానన్నాడు. ”గాలి వేగం ఎక్కువగా ఉండి జావెలిన్‌ త్రోకు కాస్త ప్రతికూల వాతావరణం ఉన్నా మంచి ప్రదర్శన చేశా” అని 24ఏళ్ల నీరజ్‌ చోప్రా వివరించాడు. ఫైనల్లో చేసిన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. దేశానికి మెడల్‌ తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరస్తానని నీరజ్‌ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఫైనల్స్‌లో తానెలాంటి ఒత్తిడి గురికాలేదన్నాడు. మూడో త్రో వేసినప్పిటీకి కూడా ధీమాగా ఉన్నానని, నాలుగో త్రోలో పుంజుకుని రజతం సాధించానని చోప్రా తెలిపాడు. అథ్లెటిక్స్‌ పోటీల్లో చాలా విషయాలు నేర్చుకున్నా. భవిష్యత్తులో స్వర్ణ పతకం కోసం కృషి చేస్తానని పేర్కొన్నాడు. అగ్రస్థానంలో నిలిచిన అండర్సన్‌ ప్రదర్శన అద్భుతంగా ఉందని, అతని త్రో చూడటానికి సులువుగా ఉన్నా 90 మీటర్లు దాటేందుకు చాలా కష్టపడ్డాడని పేర్కొన్నాడు. తనకు మంచి పోటీ ఇచ్చాడని నీరజ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకం కోసం 19ఏళ్ల భారత్‌ నిరీక్షణకు ముగింపు పలకడం సంతోషంగా ఉందన్నారు. ఇక, తాను రజతంతో సరిపెట్టుకోవడంపై వివరణ ఇస్తూ… ఒలింపిక్స్‌తో పోల్చితే వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పోటీ అత్యంత కఠినంగా ఉంటుంది. పైగా త్రోయర్లందరూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఫామ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ఈ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించడం తనకు సంతృప్తినిచ్చిందని నీరజ్‌ చోప్రా వెల్లడించాడు. టోక్యో ఒలింపిక్స్‌ కంటే ఈ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చానని తెలిపారు.

- Advertisement -

మోడీ ప్రశంసలు
ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించిన భారత జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నీరజ్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్‌ చేశారు. అత్యున్నత అథ్లెట్లలో నీరజ్‌ ఒకడని కీర్తించారు. భారత క్రీడల్లో ఇదో ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్న మోడీ… నీరజ్‌కు అభినందనలు తెలిపారు. అలాగే భవిష్యత్‌ టోర్నీల్లోనూ పతకాలు సాధించాలని కోరుకుంటూ బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, కిరణ్‌ రిజిజు సహా పలువురు ప్రముఖులు నీరజ్‌కు అభినందనలు తెలిపారు.

పానీపట్‌లో సంబురాలు
ప్రపంచ వేదికపై పతకం గెల్చిన నీరజ్‌ స్వగ్రామం హరియాణాలోని పానీపట్‌లో సంబురాలు అంబరాన్నంటాయి. చోప్రా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డ్యాన్స్‌లు చేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు. ”నీరజ్‌ శ్రమకు ఫలితం దక్కినందుకు ఆనందంగా ఉంది. నీరజ్‌ పతకం సాధిస్తాడని తమకు ముందే తెలుసు..” అని నీరజ్‌ తల్లి సరోజ చోప్రా పేర్కొన్నారు. ”మా లక్ష్యం గోల్డ్‌ మెడల్‌ అయినా సిల్వర్‌ మెడల్‌ సాధించినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది” అని నీరజ్‌ చోప్రా తాత ధరమ్‌సింగ్‌ చోప్రా ఆనందభాష్పాలతో పేర్కొన్నారు. ”మేమంతా గోల్డ్‌ మెడల్‌ సాధిస్తాడని ఆశించాం. రజత పతకంతో భారత అథ్లెట్‌ రికార్డు సృష్టించాడు. 2003లో అంజు బాబీ జార్జ్‌ లాంగ్‌ జంప్‌లో కాంస్య పతకం కైవసం చేసుకోగా, నీరజ్‌ నేడు చరిత్రను తిరగరాశాడు. అతనెప్పుడూ హిస్టరీ క్రియేట్స్‌ చేశాడు” అని నీరజ్‌ బంధువు గౌరవ్‌ పేర్కొన్నాడు.

బల్లెం విసిరితే రికార్డులే…
వరల్డ్‌ అథ్లెటిక్స్‌ రజత పతక విజేత నీరజ్‌ చోప్రా స్వస్థలం హరియాణా రాష్ట్రం పానీపట్‌ జిల్లా ఖంద్రా గ్రామం. అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు సతీష్‌ కుమార్‌, సరోజ్‌ బాల సహా ఇతర కుటుంబ సభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. ఓ వైపు విద్యాభ్యాసం చేస్తూ… మరో వైపు కుటుంబ సభ్యులతో వ్యవసాయ పనుల్లో పాల్గొనేవాడు. నీరజ్‌ 12ఏళ్లకే 90 కిలోల బరువుతో ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులు జాగింగ్‌, వ్యాయామం చేయమన్నారు. కుటుంబం బలవంత మేరకు నీరజ్‌ స్థానిక స్టేడియంలో జాగింగ్‌ చేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలో నీరజ్‌కు జావెలిన్‌ త్రో ఆటగాడు జై చౌదరీ పరిచయమయ్యాడు. జావెలిన్‌ త్రోను విసురుతూ కబుర్లు చెప్పుకొనే వారు. అలా నీరజ్‌ చోప్రాకు జావెలిన్‌ త్రో పై అభిమానం పెంచుకున్నాడు. ఇదే విషయం జై చౌధరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నీరజ్‌కు జావెలిన్‌పై ఉన్న ఆసక్తిని గుర్తించిన జై చౌదరీతోపాటు కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా… నీరజ్‌ శిక్షణకు కావాల్సినవన్నీ సమకూర్చారు. ఒక వైపు చదువును కొనసాగిస్తూనే నీరజ్‌ 2013లో ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌, 2015లో ఏసియన్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా… మంచి ప్రదర్శనే చేశాడు. 2016 నుంచి నీరజ్‌ కెరీర్‌… పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. ఆ ఏడాదిలో జరిగిన సౌత్‌ ఏసియన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏసియన్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్‌ అండర్‌-20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుపొందడమే కాక, జావెలిన్‌ను 86.48 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఏడు స్వర్ణ పతకాలు, నాలుగు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.

నాకు అలాంటి పరిస్థితే ఎదురైంది అంజు బాబీ జార్జ్‌, మాజీ లాంగ్‌ జంపర్‌
”2003లో పారిస్‌లో నేను ఉన్న పరిస్థితి నీరజ్‌కు కూడా ఎదురైంది. నాకు గూస్‌బంప్స్‌ ఉన్నాయి. అతను మూడు రౌండ్ల తర్వాత నాల్గవ స్థానంలో నిలిచాడు. మూడు రౌండ్ల తర్వాత నేను కూడా నాల్గో స్థానంలో నిలిచా. నేను మొదటి రౌండ్‌ తర్వాత అగ్రస్థానంలో ఉన్నా. కానీ మూడవ తర్వాత నేను నాల్గవ స్థానంలో ఉన్నా, పతక స్థానం నుండి బయటపడ్డా. కానీ నేను తిరిగి వచ్చి పతకం సాధించాలని నిశ్చయించుకున్నా. నీరజ్‌కి కూడా అదే జరిగిందని అనుకుంటున్నా” అని ఆదివారంనాడు మాజీ లాంగ్‌ జంపర్‌, వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో మెడల్‌ సాధించిన తొలి భారతీయురాలు అంజు బాబీ జార్జ్‌ తన అనుభవాలను పీటీఐతో పంచుకున్నారు.

మూడు రౌండ్ల తర్వాత 82.39 మీటర్లు, 86.37 మీటర్లు నమోదు చేయడానికి ముందు చోప్రా ఒక ఫౌల్‌ త్రోతో ప్రారంభించి నాల్గవ స్థానంలో నిలిచాడు. కానీ నాల్గవ రౌండ్‌ త్రోతో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి ఎగబాకాడు. చోప్రా ఐదు, ఆరు త్రోలు ఫౌల్‌లు. పోల్చి చూస్తే, అంజు రెండు ఫౌల్‌ జంప్‌లను ఎదుర్కొనే ముందు మొదటి రౌండ్‌ తర్వాత 6.61 మీటర్లతో అగ్రస్థానంలో ఉంది. ఇది ఆమెను మిడ్‌వే దశలో నాల్గవ స్థానానికి తీసుకెళ్లింది. అంజు నాల్గవ రౌండ్‌లో 6.56 మీటర్ల జంప్‌ చేసింది. ఐదో రౌండ్‌లో 6.70 మీటర్లు దూరం జంప్‌ చేసి కాంస్య పతకం చేజిక్కించుకున్న విషయాన్ని వివరించారు. అంతర్జాతీయ టోర్నీల్లో క్రీడాకారులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే చాంపియన్‌ పతక విజేత కాలేరు. సామర్థ్యాన్ని విశ్వసించాలి, ఫలితం పొందడానికి పతకం గెలవడంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 45 ఏళ్ల అంజు బాబీ జార్జ్‌ పేర్కొన్నారు. ”ఒలింపిక్‌ కిరీటం, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని గెలుచుకోవడం నిజంగా పెద్ద విజయం. నీరజ్‌… ఒత్తిడి, కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న విధానం అత్యద్భుతంగా ఉంది. దేశాన్ని మళ్లిd మళ్లిd గర్వపడేలా చేశాడు. చోప్రా ఈవెంట్‌లో తాను ఎంతగానో మునిగిపోయానని,
ప్రత్యక్షంగా వీక్షిస్తున్నప్పుడు తానే ఒత్తిడిని అనుభవించా” అని అంజు చెప్పారు. అతను తన ప్రారంభ రౌండ్‌లో ఫౌల్‌ త్రో చేసినప్పుడు, ప్రతి భారతీయుడు ఆశ్చర్యపోతాడు. నేను కూడా ఒత్తిడిలో ఉన్నా… ఎందుకంటే సాధారంగా చోప్రా మొదటి లేదా రెండో రౌండ్‌లో అత్యుత్తమంగా విసురుతాడు అని ఊహించా. నాల్గవ రౌండ్‌ త్రోతో బలంగా తిరిగి రావడం చాలా ఉపశమనం కలిగించింది. అతను నా తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండవ భారతీయ పతక విజేత. పతకం కోసం 19 ఏళ్లుగా ఎదురుచూశాం. ఇప్పుడు, తదుపరి పతకం కోసం మనం ఎక్కువ కాలం వేచిఉండాల్సిన అవసరం లేదని ఆశిస్తున్నా. నీరజ్‌తోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించగల మరికొందరు ఉన్నారు. రాబోయే కామన్వెల్త్‌ గేమ్స్‌లో కూడా మేము చాలా మంచి ప్రదర్శనను ఆశిస్తున్నాము. కొన్ని పతకాలు ఆశిస్తున్నాము. పేర్కొన్నారు.

నదీమ్‌తో హృదయ పూర్వక సంభాషణ…
ఒరెగాన్‌లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌లో భారత జావెలిన్‌ సూపర్‌స్టార్‌ నీరజ్‌ చోప్రా సిల్వర్‌ మెడల్‌ సాధించి, చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆసియన్‌ గేమ్స్‌, ఒలింపిక్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ 24ఏళ్ల నీరజ్‌ చోప్రా, 12మెన్‌ ఫైనల్‌లో రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనండా అండర్సన్‌ పీటర్స్‌ అగ్రస్థానంలో నిలిచాడు. పాక్‌ క్రీడాకారుడు అర్షద్‌ నదీమ్‌ కూడా 12మందిలో ఉన్నాడు. జావెలిన్‌ కోర్టులో చోప్రా, నదీమ్‌ తలపడడం ఇదేమి తొలిసారి కాదు. 2018 జకర్తా ఏసియన్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా, పాక్‌ క్రీడాకారుడు అర్షద్‌ నదీమ్‌ తొలిసారి జావెలిన్‌ త్రో విభాగంలో పోటీపడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇరువురు గుసగుస మాట్లాడుకుంటున్న ఓ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నాలుగేళ్ల తర్వాత నదీమ్‌తో ఒలింపిక్స్‌ చాంపియన్‌ సంభాషణ కొనసాగించాడు. ”పోటీ తర్వాత అర్షద్‌తో మాట కలిపా. మంచి ప్రదర్శన కనబరిచావని అభినందించా. ఈ సందర్భంగా నదీమ్‌ తన మోకాళ్ల నొప్పి ఇబ్బంది పెడుతోందని చెప్పుకొచ్చాడు. అయినా, అద్భుతంగా రాణించావని ప్రశంసించా, 86 మీటర్లు బరిసె విసరడం మామూలు విషయం కాదని చెప్పి, అభినందించా” అని నీరజ్‌ చోప్రా పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌లో ఫైనల్లో నదీమ్‌ 86.16 మీటర్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement