Friday, November 22, 2024

Big Story: కొహ్లీ vs బాబర్‌.. పాక్‌పై ఓటమెరుగని ఇండియా.. మెంటార్‌గా ధోనీకి సవాలే!

టీ20 ప్రపంచకప్‌ 2021లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సమరానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలిఉంది. యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం దాయాదుల పోరుపైనే దృష్టి సారించింది. చిరకాల ప్రత్యర్థుల భారత్‌-పాకిస్థాన్‌ మధ్య పోరు అంటేనే సర్వత్రా నరాల తెగే ఉత్కంఠ రాజ్యమేలుతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగే ఈ టెన్షన్‌ ప్యాక్డ్‌ మ్యాచ్‌లో ఎవరు విజేతగా నిలుసార్తనేది నేటి రాత్రికి తేలిపోనుంది.

విరాట్‌కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ప్రత్యర్థి పాక్‌ను చిత్తు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రపంచకప్‌ పోటీల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాకిస్థాన్‌ భారత్‌పై గెలిచిన దాఖలాలు లేవు. వన్డే ప్రపంచకప్‌ అయినా టీ20 ప్రపంచకప్‌ అయినా టీమిండియాదే పైచేయి. పొట్టి ప్రపంచకప్‌లో 5-0తో భారత్‌ తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతుంది. నేటి మ్యాచ్‌లో కూడా పాక్‌ను ఓడించి తమ అజేయ రికార్డును మెరుగుపరుచుకోవాలని భారత్‌ భావిస్తోంది. భారతజట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ అన్ని విభాగాల్లో కోహ్లీసేన పటిష్ఠంగా ఉంది.

బాబర్‌ సేన దూకుడు
భారత్‌ అన్ని రంగాల్లోనూ పాక్‌ కంటే పటిష్టంగా ఉంది. అయినాసరే పాకిస్థాన్‌ ఈసారి తప్పక గెలుస్తుందనే పాక్‌ అభిమానుల ధీమాకు వెనుక ఉన్నది కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌. కోహ్లీతోపాటు బాబర్‌కు కూడా సారథిగా ఇదే తొలి టీ20ప్రపంచకప్‌.. కానీ బాబర్‌ ఐసీసీ టీ20 బ్యాటర్లలో రెండోస్థానంలో ఉన్నాడు. నిలకడగా ఆడుతూ అంచనాలకు మించి రాణిస్తున్నాడు.

భారత్‌లో కోహ్లీకి ఉన్న ఆదరణ పాక్‌లో బాబర్‌కు కూడా ఆస్థాయిలోనే ఉంది. బాబర్‌ తన కెరీర్లో 61టీ20 మ్యాచ్‌ల్లో 2,204పరుగులు చేయగా వీటిలో ఓ సెంచరీ, 20 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఖాతాలో ఒక్క శతకం కూడా లేదు. బాబర్‌ అత్యధిక స్కోరు 122పరుగులు..మూడోస్థానంలో బరిలోకి దిగే అతడు నిలదొక్కుకుంటే పాక్‌ స్కోరు పరుగులు పెడుతుంది.

కాగా బాబర్‌సేనలో ఉన్న మహమ్మద్‌ రిజ్వాన్‌ ఏడో ర్యాంకులో ఉండటం పాక్‌ అభిమానుల విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. వీరితోపాటు ఫకర్‌ జమాన్‌, అసిఫ్‌ అలీకూడా ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో షహీన్‌ అఫ్రిది, హసన్‌ అలీ, మహమ్మద్‌ హఫీజ్‌ కీలకం కానున్నారు. కానీ మెరుగైన స్పిన్నర్లు లేకపోవడం లోటుగా ఉంది. ఎప్పుడు ఎలా ఆడతారో తెలియన పాక్‌ జట్టులోని బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా మెరిస్తే పాక్‌ను ఆపడం అంత సులభంకాదు. పాక్‌ యువ పేసర్‌, ఎడమచేతివాటం ఫాస్ట్‌బౌలర్‌ షహీన్‌ అఫ్రిదిపై భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

21ఏళ్ల పేసర్‌ ఈ ప్రపంచకప్‌లో అద్భుతాలు చేస్తాడని పాక్‌ ఆటగాళ్లతోపాటు అభిమానులు గట్టి నమ్మకంగా ఉన్నారు. మరోవైపు కొత్తగా కోచ్‌లుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన హెడేన్‌, ఫిలాండర్‌ శాయశక్తులా మంచి ఫలితాన్ని రాబట్టాలని చిత్తశుద్ధితో ఉన్నారు.

సమరానికి కింగ్‌ కోహ్లీ సై
టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాక్‌తో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ కెప్టెన్‌ కోహ్లీ అజేయంగా నిలిచాడు. 2012 ప్రపంచకప్‌లో పాక్‌పై 61బంతుల్లో 78పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ 2014లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో 36బంతుల్లో 38పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

చివరగా గత 2016 ప్రపంచకప్‌లో కోహ్లీ 37బంతుల్లో 55పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మెగా టోర్నీలో పాక్‌పై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ 169పరుగులతో 130కిపైగా స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో మూడువేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కింగ్‌ కోహ్లీ నిలిచాడు.

కాగా పాకిస్థాన్‌తో ఆడిన 6టీ20 మ్యాచ్‌ల్లోనూ విరాట్‌కోహ్లీ 84.66సగటుతో 254పరుగులు చేయగా వీటిలో మూడు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. కాగా మెంటార్‌గా ధోనీ టీమిండియాను వెనకుండి నడిపించనున్నాడు. ఐపీఎల్‌లో మెరిసిన భారత ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రతిఒక్కరూ మ్యాచ్‌విన్నర్‌గా కనిపిస్తున్నారు.

రోహిత్‌, రాహుల్‌, విరాట్‌, సూర్య, పంత్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలో ఉన్న భారత్‌ 2016 టీ20కప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌లో 72మ్యాచ్‌లు ఆడింది. 65.3శాతం విజయాలతో 47విజయాలు, 22ఓటములతో మెరుగైన స్థితిలో ఉంది. టీ20 ప్రపంచకప్‌ల్లో ఆడిన 33 మ్యాచ్‌ల్లో 21విజయాలను నమోదు చేసింది. కోహ్లీకి కెప్టెన్‌గా ఇదే చివరి టీ20 ప్రపంచకప్‌ కావడంతో ధోనీ సైతం మరోసారి భారత్‌ను విజేతగా నిలపాలనే పట్టుదలతో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement