ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచులో భారత్ పై 28 పరుగుల తేడాతో విజయం సాధించిందిన ఇంగ్లాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టులో ఆడడం అనుమానంగా మారింది. తొలి టెస్టులో జాక్‌లీచ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతడు డైవ్ చేయడంతో మోకాలికి గాయమైంది. ఇంగ్లాండ్ జట్టు (బుధవారం) విశాఖలోని మైదానంలో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లోనూ అతడు పాల్గొనలేదు.
తొలి టెస్టులో గాయపడ్డప్పటికీ.. స్ట్రాప్పింగ్ వేసుకుని నొప్పితోనే బౌలింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు ఓ వికెట్ కూడా తీశాడు. అతడిగాయంపై ఇంగ్లాండ్ స్పిన్ కోచ్ జీతన్ పటేల్ మాట్లాడుతూ.. తాకిన చోటే రెండు సార్లు తాకడంతో గాయం తీవ్రవ ఎక్కువగా ఉందన్నాడు. అయినప్పటికీ తొలి టెస్టులో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. కాగా.. గాయం నుంచి జాక్‌లీచ్ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.