టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ లో విజృంభించిన సంగతి తెలిసిందే. బుమ్రా మ్యాజికల్ స్పెల్ ద్వారా ఇంగ్లండ్ వైపు మొగ్గుతున్న మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపు తిరిగింది. ఇక ఇదే తరుణంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఓలీ పోప్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో వంద వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు బుమ్రా. అయితే బుమ్రా తన తొలి టెస్టు వికెట్‌ను ఎలా దక్కించుకున్నాడో.. సరిగ్గా వందో వికెట్ కూడా దాదాపు అలాగే పొందడం చర్చనీయాంశంగా మారింది. ఇక బుమ్రా తన తొలి వికెట్‌ను కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఏబీ డివిలియర్స్ రూపంలో అందుకున్నాడు. బుమ్రా డెలివరీని ఏబీ డివిలియర్స్ ఆడే క్రమంలో బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. ఇక బమ్రా వందో వికెట్ కూడా అలాగే వచ్చింది. ఆఫ్‌స్టంప్ మీదుగా వచ్చిన బంతిని అంచనా వేయడంలో పోప్ పొరబడ్డాడు. బంతి అద్భుతంగా ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని నేరుగా వికెట్లను గిరాటేసింది. ప్రస్తుతం బుమ్రా తొలి వికెట్.. వందో వికెట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక బుమ్రా జడేజాతో సమంయుక్తంగా టెస్టులో 24 టెస్టుల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్ గా ఉన్నాడు. ఓవరాల్‌గా బుమ్రా టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల క్లబ్‌లో చేరిన జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ 18 టెస్టుల్లోనే 100 వికెట్ల మార్క్‌ను చేరుకొని ఓవరాల్‌గా మూడో స్థానంలో.. టీమిండియా తరపున తొలి స్థానంలో ఉన్నాడు.
ఇది కూడా చదవండి: బుమ్రా బంతి అడిగి మరి వికెట్లు తీశాడు: విరాట్ కోహ్లీ..