Friday, November 22, 2024

BCCI | కొత్త కోచ్… కొత్త సెల‌క్ష‌న్ క‌మిటి

టీమిండియా కొత్త కోచ్ ఎంపికపై బీసీసీఐ సెక్రటరీ జై షా తాజాగా కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల‌లో శ్రీలంక పర్యటనకు వెళ్లేలోపే కొత్త హెడ్ కోచ్ ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. ఎంపికైన కొత్త కోచ్‌తోనే భారత్ ఈ నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుందని సోమవారం జై షా పేర్కొన్నారు.

కానీ, కోచ్‌గా ఎవరు ఎంపికయ్యారన్నదానిపై మాత్రం ఆయ‌న‌ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే కొత్త సెలక్టర్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తామ‌ని చెప్పారు. అయితే మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ జట్టు కోచ్‌గా ఎంపిక కానున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అతడి ఇంటర్వ్యూ కూడా ఇటీవ‌ల పూర్త‌యిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

“కోచ్, టీం సెలక్టర్ ఎంపిక త్వరలోనే పూర్తవుతుంది. సీఏసీ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించిన అనంత‌రం ఈ పదవులకు ఇద్దరి పేర్లు ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేశాం. ముంబై చేరుకున్నాక మరిన్ని వివరాలు వెల్ల‌డిస్తాం. టీమిండియా త్వరలో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది. ఈ పర్యటనకు మాత్రం వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వెళ్లనున్నారు. శ్రీలంక టూర్‌ నాటికి కొత్త కోచ్ జట్టుతో చేరతారు” అని షా సోమవారం పేర్కొన్నారు.

కాగా, జులై 6 నుంచి జింబాబ్వే టూర్ ప్రారంభం అవుతుంది. ఇక జులై 27న శ్రీలంక టూర్‌ ప్రారంభం కానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు ఆతిథ్య శ్రీలంకతో 3 టీ20, 3 వన్డేలు అడనుంది.

ఇక ఇద్దరు దిగ్గజాలు టీ20 ప్రపంచ కప్‌ విజయం తర్వాత అంత‌ర్జాతీయ టీ20ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. రోహిత్, కోహ్లీ బాట‌లోనే ఒక రోజు తర్వాత ఇదే ఫార్మాట్‌కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు చెప్పాడు. అయితే, వ‌చ్చే ఏడాది జ‌రిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే త‌మ‌ లక్ష్యమ‌ని షా అన్నారు. అందుకే సీనియర్లు అక్కడ జ‌ట్టులో ఉంటార‌ని తెలిపారు.

- Advertisement -

ఇదిలాఉంటే.. రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలం 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీతో ముగిసింది. 2021 నవంబర్‌లో హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. కాగా, గతేడాది 2023 వన్డే ప్ర‌పంచ‌క‌ప్‌ నాటికే ఆయ‌న‌ పదవీకాలం ముగిసింది. కానీ మరో 6 నెలలపాటు ద్రవిడ్ ఆ పదవిలో ఉన్నారు. ఇక కొత్తగా ఎంపికయ్యే కోచ్ 2027 వన్డే ప్ర‌పంచ‌క‌ప్‌ వరకూ ఆ పదవిలో కొన‌సాగ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement