ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో ఈ నెల 16న భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఐపీఎల్ 10 జట్ల యజమానులతో బీసీసీఐ 2025 సీజన్‌కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. కాగా, ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ తదితరులు హాజరుకానున్నారు.
ఇందులో ప్రధానంగా 2025 ఎడిషన్‌కు ముందు నిర్వహించే మెగా వేలంకు సంబంధించి పలు కీలక నిర్ణయాలతో పాటు వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్ల రిటెన్షన్‌లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని కోరుతుంటే.. మరికొన్ని జట్లు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. కాగా, 2022 సీజన్‌కు ముందు నిర్వహించిన చివరి మెగా వేలంలో ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించారు. అందులో ముగ్గురు దేశీయ ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడు ఉండాలి లేదా ఇద్దరు భారత ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండాలి. ఈసారి రిటైన్ ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని పలు ఫ్రాంచైజీలు కోరుతున్నట్లు తెలిసింది. ఇక ఇటీవలె వేలంలో ఫ్రాంచైజీల పర్సు వాల్యు కూడా రూ. 100 కోట్లకు పెంచడం జరిగింది.