ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కసరత్తులు మొదలెట్టేసింది. ఈ క్రమంలోనే పీసీబీ కొన్ని రోజుల క్రితమే ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించింది. అయితే, ఈ షెడ్యూల్‌పై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ ఆడేందుకు భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని సమాచారం. ఇప్పటికే తమ నిర్ణయాన్ని ఐసీసీకి తెలియజేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
గతేడాతి జరిగిన ఆసియాకప్ మాదిరిగానే ఈసారి చాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరినట్లు సమాచారం. ఆసియాకప్‌లో నిర్వహించినట్లు ఈసారి కూడా టీమిండియా మ్యాచ్‌లు హైబ్రిడ్ పద్దతిలో ఇతర దేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇక పాకిస్తాన్లో జరగబోయే ఈ ఐసీసీ టోర్నీలో ఆడేందుకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సమ్మతి తెలిపాయి.
భారత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక దీనిపై ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇక 2008 తర్వాత నుంచి ఇప్పటివరకు భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత జట్టును బీసీసీఐ పాక్‌కు పంపడం లేదు. మరోవైపు అప్పటి నుంచి ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదు.
కాగా, పాకిస్తాన్ వేదికగా 2025 ఫిబ్రవరి, మార్చి నెలల్లో చాంపియన్స్ ట్రోఫీ సమరం జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎలో భారత్ పోటీ పడుతోంది. ఈ గ్రూప్‌లో టీమిండియాతో పాటు ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.