Tuesday, November 26, 2024

బీసీసీఐకి ఏమైంది..? రెండుగా చీలిన బోర్డు.. గంగూలీ వ్యవహార శైలే కారణమా?

బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ, మరో వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ వర్సెస్‌ బీసీసీఐ నడుస్తున్నది. ఫలితంగా భారత్‌ క్రికెట్‌ జట్టు, బోర్డు ప్రతిష్ట దిగజారిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా దాదా.. బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ సమావేశాలకు హాజరు అవుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం కారణంగానే.. బోర్డు రెండు వర్గాలుగా చీలిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీతో విభేదాలు ముగియకముందే.. దాదాపై వచ్చిన ఈ ఆరోపణలు హాట్‌ టాపిక్‌గా మారాయి. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. బోర్డు అధ్యక్షుడు, సెలెక్షన్‌ కమిటీ సమావేశాల్లో జోక్యం చేసుకునేందుకు వీల్లేదు. కానీ బీసీసీఐ కార్యదర్శికి మాత్రం ఆ అవకాశం ఉంది. జట్టును ఎంపిక చేసే తుది నిర్ణయం మాత్రం సెలెక్టర్లదే. సెలెక్షన్‌ కమిటీ.. కెప్టెన్‌, కోచ్‌లతో మాట్లాడి జట్టును ఎంపిక చేస్తుంది. కానీ దీనికి విరుద్ధంగా దాదా సెలెక్షన్‌ కమిటీ భేటీల్లో పాల్గొంటున్నాడు.

బోర్డు ప్రతినిధుల భిన్న వాదన..

ఈ విమర్శల నేపథ్యంలో.. బీసీసీఐలోని ఇద్దరు ప్రతినిధులు భిన్నంగా స్పందించారు. గంగూలీపై వచ్చిన ఆరోపణలపై బీసీసీఐకి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. అవన్నీ.. పూర్తిగా అర్థం లేని ఆరోపణలు.. అది అబద్ధం అని తెలిపాడు. మరో వ్యక్తి మాట్లాడుతూ.. గంగూలీ తనకు అవసరం లేని విషయాల్లో తలదూర్చుతున్నాడని, బీసీసీఐ ఇప్పుడు ఇలాగే నడుస్తున్నదని.. సెలెక్షన్‌ కమిటీ మీటింగ్‌లకు హాజరయ్యే అధికారం గంగూలీకి లేదన్నారు. ఇది దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానించారు. కెప్టెన్‌, కోచ్‌లు నిస్సాహాయులుగా మారిపోతున్నారని విమర్శించారు.

ఇప్పటికే కోహ్లీ కెప్టెన్సీ వివాదం..

దక్షిణాఫ్రికా జట్టుతో సిరీస్‌ ఆడే ముందు కోహ్లీ కెప్టెన్సీ వ్యవహారంపై పెనుదుమారమే చెలరేగింది. ఎంత చెప్పినా కోహ్లీ వినలేదని గంగూలీ.. అసలు నన్ను ఎవరూ సంప్రదించలేదని విరాట్‌.. వ్యాఖ్యలు బీసీసీఐ ప్రతిష్టను దిగజార్చాయని చెప్పుకోవచ్చు. సెలెక్షన్‌ కమిటీ సమావేశాలకు గంగూలీ హాజరవుతున్నాడనే విషయాన్ని ఓ జర్నలిస్టు బహిర్గతం చేశాడు. ఒకే బోర్డులోని ఇద్దరు వ్యక్తులు.. వేర్వేరు ప్రకటనలు చేయడం గమనార్హం. ఒకరు గంగూలీని వెనుకేస్తుంటే.. మరొకరు తీవ్రంగా విమర్శించడం బోర్డు రెండుగా చీలిందనడానికి నిదర్శనం. ఇప్పటి వరకు 2సార్లు కమిటీ సమావేశానికి హాజరైనట్టు సమాచారం. గంగూలీకి రోజులు దగ్గరపడ్డాయంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. సౌరవ్‌తో పాటు బోర్డు కార్యదర్శి జై షాపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement