న్యూఢిల్లి: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్ష పదవికి నరీంద్ర బత్రా రాజీనామా చేశారు. దీంతోపాటు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐవోసీ) చీఫ్, మెంబర్ తదితర మూడు పదవులు త్యజించినట్లు ప్రకటించారు. ఈమేరకు ఎఫ్‌ఐహెచ్ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు లేఖ రాసినట్లు తెలిపారు. ”వ్యక్తిగత కారణాలతోనే ఎఫ్‌ఐహెచ్ అధ్యక్ష పదవి నుంచి తప్పించుకుంటున్నా. ఈ మేరకు రాజీనామా లేఖ సమర్పించా. ఇంతవరకు తనకు మద్దతిచ్చి సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” అని నరీందర్ బత్రా సోమవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు.
హాకీ ఇండియా (హెచ్‌ఐ)లో బత్రా శాశ్వత సభ్యత్వాన్ని ఢిల్లి హైకోర్టు రద్దు చేస్తూ మే 25న తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి వైదొలగినట్లు సమాచారం. ఐవోఏ ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తూ సోమవారంనాడు ఐవోఏ సెక్రటరీ-జనరల్‌కు లేఖ పంపారు. బత్రా రాజీనామాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆమోదించింది. అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా బత్రా కొనసాగుతాడని ఎఫ్‌ఐహెచ్ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.