- బెంగళూరు స్కోరు: 13.1 ఓవర్లలో 75/6.. ఇంకా 41 బంతుల్లో 70 పరుగులు చేయాల్సి ఉంది..
టాటా ఐపీఎల్ 2022లో భాగంగా ఇవ్వాల 39వ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్‌కి మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. కాగా, బెంగళూరు 145 పరుగుల టార్గెట్ చేజ్ చేయాల్సి ఉంది. అయితే.. ఓపెనర్ అవతారం ఎత్తినా కూడా కోహ్లీ రాత మారలేదు. తొలి ఓవర్లోనే మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతను.. ఈ మ్యాచ్‌లో 9 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో షార్ట్ బాల్‌కు బలయ్యాడు. ప్రసిద్ధ్ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన కోహ్లీ.. టైమింగ్ మిస్ అయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. దాన్ని పరాగ్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి మరీ అందుకోవడంతో కోహ్లీ వెనుతిరిగాడు.
ఆ బంతి బ్యాట్‌ను మిస్ అయ్యి హెల్మెట్‌కు తగిలిందేమో? అనిపించింది. కానీ కోహ్లీ మైదానం వీడటంతో అది బ్యాట్‌కే తగిలినట్లేనని అభిమానులు అనుకున్నారు. రిప్లేలో కూడా అదే కనిపించింది. దీంతో 10 పరుగుల వద్ద బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పోరాడింది. టాపార్డర్ పూర్తిగా విఫలమైనా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్ (56 నాటౌట్) చెలరేగడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ (8), దేవదత్ పడిక్కల్ (7) పూర్తిగా నిరాశ పరిచారు. తర్వాత వచ్చిన అశ్విన్ (17), సంజూ శాంసన్ (27), డారియల్ మిచెల్ (16), ఫర్వాలేదనిపించారు.
రియాన్ పరాగ్ అర్ధశతకంతో అజేయంగా నిలువగా.. భారీ అంచనాలు పెట్టుకున్న షిమ్రాన్ హెట్మెయర్ (3) విఫలమయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ (5), ప్రసిద్ధ్ కృష్ణ (2) పరుగులు చేశారు. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బెంగళూరు బౌలర్లకు.. చివరి ఓవర్లలో ఫీల్డర్ల నుంచి మద్దతు కరువైంది. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను కీపర్ దినేష్ కార్తీక్ జారవిడిచాడు. ఆ మరుసటి ఓవర్లో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పరాగ్ కొట్టిన బంతి గాల్లోకి ఎత్తుగా లేచింది. అయితే దాన్ని హసరంగ జారవిడిచాడు. ఇలా బతికిపోయిన పరాగ్ ఆ తర్వాత.. 8 బంతుల్లో 21 పరుగులు పిండుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హాజిల్‌వుడ్, హసరంగ, సిరాజ్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. హర్షల్ పటేల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.