బంగ్లాదేశ్ గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. కీలకమైన రెండో టెస్టులో థ్రిల్లింగ్ విక్టరీతో సిరీస్ సమం చేసింది. మ్యాచ్‌లో టిమ్ సౌథీ సేన 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్ (40 నాటౌట్) మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అతడికి మిచెల్ శాంట్నర్ (35 నాటౌట్) ధనాధన్ ఆటతో అండగా నిలిచాడు. వీళ్లిద్దరూ ఏడో వికెట్‌కు 70 రన్స్ జోడించారు.. దీంతో సౌతీ బృందం రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
నాలుగో రోజు తొలి సెషన్‌లోనే కివీస్ స్పిన్నర్లు బంగ్లాదేశ్ ఆటకట్టించారు. అజాజ్ పటేల్ 6 వికెట్లతో, మిచెల్ శాంటర్న్ 3 వికెట్లు తీయడంతో అతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే కుప్పకూలింది. 138 పరుగుల ఛేదనలో కివీస్ కష్టాల్లో పడింది. ఆదుకుంటారనుకున్న కేన్ విలియమ్సన్(11), డారిల్ మిచెల్(19), టామ్ బండిల్(2) నిరాశపరిచారు. అప్పుడు తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడిన ఫిలిఫ్స్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ నిలబడ్డాడు. శాంట్నర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 70 రన్స్ జోడించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.