Wednesday, September 18, 2024

ICC | ఆడ‌కుండానే నంబ‌ర్ వ‌న్నా… !

ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో అతడిదే టాప్‌ ప్లేస్.
అయితే, దాదాపు ఎనిమిది నెలల నుంచి 50 ఓవర్ల క్రికెట్‌ ఆడని బాబర్‌ ఇంకా మొదటి ర్యాంకులో ఉండటంపై పాక్‌ మాజీ ఆటగాడు బసిత్ అలీ విస్మయం వ్యక్తంచేశాడు. బాబర్‌ ఆడకపోయినా ఐసీసీ ర్యాంకులను కేటాయిస్తున్నట్లుందని వ్యాఖ్యానించాడు. అసలు ర్యాంకింగ్‌ సిస్టమ్‌ అర్థంకావడం లేదని తెలిపాడు.

”వన్డే బ్యాటర్ల విభాగంలో ఐసీసీ ర్యాంకులను చూశా. బాబర్ అజామ్‌ టాప్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇతర పేర్లను చదవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఈ ర్యాంకులను చూస్తుంటే.. బాబర్‌ అజామ్‌ ఆడకపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా ఐసీసీ తీరు ఉంది. వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంకర్‌గా ఉన్నందుకు బాబర్ సంతోషపడతాడు. అసలు ఇలాంటి ర్యాంకులను ఇచ్చిందెవరు? దేని ప్రకారం బాబర్‌ అజామ్‌, గిల్ ఈ స్థానాల్లో ఉన్నారు? బాబర్ అజామ్‌ తన చివరి వన్డేను గతేడాది వరల్డ్‌ కప్‌లోనే ఆడాడు. అప్పటినుంచి ఒక్కసారి కూడా బరిలోకి దిగలేదు. అయినా, అతడి ర్యాంకు మాత్రం అలానే ఉంది. ఇక భారత యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ శ్రీలంకపైనే ఆడాడు. గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. మరోవైపు గత వన్డే ప్రపంచకప్‌లో రచిన్, క్వింటన్ డికాక్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ తదితరుల ఆటను చూశాం. టోర్నీలో అద్భుతంగా ఆడి సెంచరీలు సాధించారు. పాక్‌ నుంచి కేవలం రిజ్వాన్, ఫఖర్ జమాన్ మాత్రమే శతకాలు చేశారు. అలాంటప్పుడు ర్యాంకుల విధానం సరిగ్గా లేదని అనిపిస్తోంది” అని బసిత్ పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement