Tuesday, November 19, 2024

IPL : ఉప్ప‌ల్ స్టేడియంకు అవార్డు

ఐపీఎల్-2024 ముగిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిమెట్టుపై బోల్తాపడింది. ఫైనల్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్ ముగిసిన అనంతరం రన్నరప్ చెక్‌ను అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఐపీఎల్ నిర్వాహకులు రూ. 12.5 కోట్ల ప్రైజ్‌మనీ అందజేశారు.

- Advertisement -

మరోవైపు తృటిలో కప్‌ను చేజార్చుకున్న సన్‌రైజర్స్‌కు ఫెయిర్ ప్లే అవార్డు దక్కింది. ఇక తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. ఈ 21 ఏళ్ల కుర్రాడు బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటాడు.

అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌కు ఉత్తమ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు దక్కింది. ప్రోత్సాహకంగా రూ. 50 లక్షల నగదు లభించింది. ఈ అవార్డును ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఛాముండేశ్వరి నాథ్ నుంచి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రావు అందుకున్నారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో హెచ్‌సీఏ ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్‌హెచ్-గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మిగిలిన మ్యాచ్‌లన్నీ ఆసక్తికరంగా సాగాయి. సొంతమైదానంలో ఆర్సీబీతో మ్యాచ్ మినహా మిగిలిన్నింట్లో సన్‌రైజర్స్ విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement