ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెద్ద సంచలనం నమోదైంది. స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్కు చుక్కెదురైంది. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నాదల్ 23వ గ్రాండ్‌స్లామ్ అందుకోవాలన్న కల తీరకుండానే రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం ఉదయం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అమెరికాకు చెందిన మెకెంజీ మెక్ డొనాల్డ్ చేతిలో 6-4, 6-4, 5-7 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. నాదల్ ఆరంభం నుంచే కోర్టులో ఇబ్బందిగా కదిలాడు. తుంటిగాయంతో ఇబ్బందిపడ్డ నాదల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
మధ్యలో మెడికల్ టైమ్ ఔట్ తీసుకున్నప్పటికీ ప్రత్యర్థిని ఎదుర్కోలేకపోయాడు. దీంతో తీవ్ర నిరాశతో టోర్నీ నుంచి వైదొలగాడు. మెకంజీ మెక్‌డొనాల్డ్ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. నాదల్ ఓటమిని తట్టుకోలేకపోయిన అతని భార్య మరియా పెరెలో కన్నీళ్లు పెట్టుకుంది. మ్యాచ్ తర్వాత నాదల్ మాట్లాడుతూ… తాను మానసికంగా ఇబ్బందికి గురయ్యానని పేర్కొన్నాడు. తన కెరీర్ గురించి తదుపరి నిర్ణయం తీసుకునే వయసు తనకుందని వ్యాఖ్యానించాడు.