Thursday, November 21, 2024

ఆసీస్‌ బోణీ.. తొలి టెస్టులో 9వికెట్ల తేడాతో విజయం.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ట్రావిస్‌ హెడ్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ బోణీ కొట్టింది. గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో సమష్టిగా రాణించి పర్యాటక ఇంగ్లండ్‌పై 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగోరోజే మొదటి టెస్టును కైవసం చేసుకుంది. దీంతో ఐదుటెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. శనివారం 220/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ మరో 77పరుగులకే ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ సాధించిన 19పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 5.1ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 20 పరుగులుతో ఛేదించింది. భారీ సెంచరీతో ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్‌ హెడ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ 38పరుగులకే 5వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్‌ 147పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ 58బంతుల్లో 5ఫోర్లుతో 39పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఓలీపోప్‌ (35), క్రిస్‌వోక్స్‌ (21), ఓపెనర్‌ హమీద్‌ (25) తప్ప మిగిలిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లులో కమిన్స్‌ 5వికెట్లు, హేజిల్‌వుడ్‌, స్టార్క్‌ చెరో రెండు వికెట్లు తీయగా కామెరూన్‌ గ్రీన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

కంగారూల ఆల్‌రౌండ్‌ షో
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 425పరుగుల భారీస్కోరు సాధించి గెలుపు బాటలు పరుచుకుంది. ఆసీస్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో 148బంతుల్లో 14ఫోర్లు, 4సిక్సర్లతో 152 పరుగులు చేసి కంగారూల జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 176బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లతో 94పరుగులు చేసి శుభారంభాన్ని అందించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన లబుషేన్‌ కూడా 117బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లతో 74పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో తనవంతు పాత్ర పోషించాడు. చివర్లో స్టార్క్‌ (35) కూడా మెరవడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. మొత్తంమీద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104.3ఓవర్లలో 425పరుగులు సాధించి ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌, రాబిన్‌సన్‌ చెరో మూడు వికెట్లు తీయగా, క్రిస్‌వోక్స్‌ 2, జాక్‌లీచ్‌, రూట్‌ చేరో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం మూడో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌ 220/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. నాలుగోరోజు నాథన్‌ లయన్‌ చెలరేగిపోయి 91పరుగులకు 4వికెట్లు తీయడంతో మరోసారి ఇంగ్లండ్‌ కుదేలైంది. కేవలం 77పరుగులు మాత్రమే జోడించి 297పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ 165బంతుల్లో 10ఫోర్లు 89పరుగులు చేసి గ్రీన్‌ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అదేవిధంగా డేవిడ్‌ మలన్‌ 195బంతుల్లో 10ఫోర్లుతో 82పరుగులు చేసి గ్రీన్‌ బౌలింగ్‌లో క్యారీ చేతికి చిక్కి వెనుదిరిగాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 172పరుగులు జోడించారు. కేవలం 6పరుగుల వ్యవధిలోనే వీరిద్దరూ పెవిలియన్‌కు చేరుకున్నారు. మిగిలిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు స్వల్ప స్కోరుకే పరిమితమవడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement