Sunday, November 3, 2024

AUS vs NED: నెద‌ర్లాండ్స్ పై 309 ప‌రుగుల తేడాతో ఆసీస్‌ ఘ‌న విజ‌యం…

నెద‌ర్లాండ్స్ పై ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. 400 ప‌రుగుల టార్గెట్ తో బ్యాటింగ్ చేప‌ట్టిన నెద‌ర్లాండ్స్ జ‌ట్టు 90 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో ఆస్ట్రేలియా జ‌ట్టు 309 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టిన మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌ కప్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదుచేసింది. నెదర్లాండ్స్‌తో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. 309 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసి 399 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ను 90 కే పరిమితం చేసింది.

ఫలితంగా కంగారూలు.. 309 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌ రేసులో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఆసీస్‌ నిర్దేశించిన 400 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్‌ ఏ దశలోనూ పోటీనివ్వలేదు. 28 పరుగులకే ఆ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. మిచెల్‌ స్టార్క్‌ నెదర్లాండ్స్‌ పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత డచ్‌ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. విక్రమ్‌ జిత్‌ సింగ్‌ (25), అకర్‌మన్‌ (10), బస్‌ డీ లీడ్‌ (4), సిబ్రండ్‌ (11) లు క్రీజులో నిలబడటానికే నానా తంటాలు పడ్డారు. 62 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (12 నాటౌట్‌), తేజ నిడమనూరు (18 బంతుల్లో 14, 2 ఫోర్లు) తో కలిసి ఆరో వికెట్‌ కు 22 పరుగులు జతచేశాడు. తేజను మిచెల్‌ మార్ష్‌ ఔట్‌ చేశాక తర్వాత వచ్చిన ఇద్దరు బ్యాటర్లు లొగాన్‌ వాన్‌ బీక్‌, వాన్‌ డెర్‌ మెర్వ్‌లు సున్నాల‌కే ఔట్ అయ్యారు. ఆర్యన్‌ దత్‌ కూడా ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. వాన్‌ డెర్‌ మెర్వ్‌ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్ 90 వద్ద ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement