కరీంనగర్, ఆంధ్రప్రభ : పోలీసు ఉద్యోగం అంటేనే శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి ఉంటుందని వాటిని జయించేందుకు క్రీడలు ఉపయోగపడతాయని రాష్ట్ర ఇంటలిజెన్స్ డిజిపి శివధర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో మూడవ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలను పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు.
నూతన లోగో తో పాటు పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతి ని వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడా పోటీలు పౌరుషాల గడ్డ కరీంనగర్ కమిషనరేట్ వేదిక అయినందుకు చాలా సంతోషం గా ఉందన్నారు. అద్భుతమైన ఏర్పాట్లు చేసినందుకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతిని అభినందించారు.
2015, 2017 లో రెండు సార్లు జరిగాయన్నారు. పోలీస్ ఉద్యోగం శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా కలిగి ఉంటుందని దానిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం పోలీసులు జాతీయ స్థాయిలో పాల్గొని 26 బంగారు , 79 వెండి , 102 కాంస్య పతకాలు సాధించారన్నారు.ఈ స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలన్నారు. 2380 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఆటల్లో పాల్గొనడం క్రమశిక్షణకు నిదర్శనం అన్నారు. క్రీడల్లో ఎత్తు కి పై ఎత్తులు వేస్తూ ఆడటం వలన నేరస్థుల ఆలోచనలకు పై ఎత్తులు వేసి నేరాలను అరికట్టేందుకు దోహదం అవుతుందన్నారు.
ఐజీపీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత ఈ క్రీడలు కరీంనగర్ లో నిర్వహిస్తున్నామన్నారు. 20 జోన్ల నుండి దాదాపు 2400 మంది 28 రకాల క్రీడల్లో పాల్గొంటున్నారన్నారు. మల్టీ జోన్ – I ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు నిత్య జీవితంలో క్రీడలు భాగంగా చేర్చుకొని శారీరకంగా మానసికంగా ధృడంగా ఎదగాలన్నారు. మంచి క్రీడా స్పూర్తితో పాల్గొనాలన్నారు.
ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాసులు, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల ఎస్పీ అశోక్ , కరీంనగర్ రూరల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ , వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర ఏఎస్పీ కరీంనగర్ అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.