బాన్‌చాంగ్: థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్ భారత రోయర్లు సత్తా చాటారు. చివరి రోజు ఆదివారం భారత రోయర్లు ఒక స్వర్ణం, మూడు రజతాలు గెలుచుకున్నారు. దీంతో భారత ఖాతాలో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు చేరాయి. లైట్‌వెయిట్ పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్‌లో సీనియర్ రోయర్ అరవింద్‌సింగ్ స్వర్ణం సాధించాడు. అరవింద్ తన ప్రత్యర్థులను 7:55.942 సెకన్ల టైమింగ్‌తో అధిగమించాడు. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్‌లో అర్జున్‌లాలా జాట్‌తో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో 11వ స్థానంలో నిలిచిన అరవింద్.. ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఉజ్బెకిస్థాన్, చైనా, వియత్నాం, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లను ఓడించాడు. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్, పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్, పురుషుల కాక్స్‌లెస్ ఈవెంట్స్‌లో భారత్ మరో మూడు రజత పతకాలను గెలుచుకుంది.
మొత్తంమీద భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలతో మెరిసింది. లైట్ వెయిట్ పురుషుల డబుల్స్ స్కల్స్‌లో ఆశిష్ ఫుగట్, సఖ్జిందర్‌సింగ్ 7:12.568 సెకన్లతో రజతం గెలుచుకున్నారు. పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్‌లో బిట్టుసింగ్, జాకర్‌ఖాన్, మంజీత్‌కుమార్, సుఖ్మీత్‌సింగ్ రెండో స్థానంలో నిలిచారు. 6:33:661సెకన్లలో 0.523 సెకన్ల తేడాతో పసిడి పతకాన్ని కోల్పోయి రజతంతో సరిపెట్టుకున్నారు. పురుషుల కాక్స్‌లెస్ ఫోర్ల ఫైనల్లో జస్వీర్‌సింగ్, పునీత్‌కుమార్, గుర్మీత్‌సింగ్, చరణ్‌జీత్‌సింగ్ 6:51:661 సెకన్లతో రజతాన్ని గెలుచుకున్నారు. అంతకుముందు శనివారం జరిగిన రేసులో అర్జున్‌లాల్, రవి..పురుషుల డబుల్స్ స్కల్స్‌లో స్వర్ణం గెలుచుకున్నారు. ఈ జోడీ 6:57.8 సెకన్లలో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. సింగిల్స్ స్కల్‌లో పర్మీందర్‌సింగ్ రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణించిన భారత రోయర్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ తదితరులకు రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ ఎంవీ శ్రీరామ్ అభినందనలు తెలిపారు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది మెరుగైన ప్రదర్శనతో మెరుస్తున్న ఇస్మాయిల్ బేగ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.