హైదరాబాద్: ఆసియా హ్యాండ్‌బాల్ పురుషుల క్లబ్ లీగ్ చాంపియన్‌షిప్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా వచ్చే నెల 21న ఆరంభమనున్న పోటీలు జూలై 1వ తేదీతో ముగియనున్నాయి. ఆసియా హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (ఏహెచ్‌ఎఫ్) కోశాధికారి బాదర్ అల్ తేయాబ్, ఏహెచ్‌ఎఫ్ ఈసీ మెంబర్ అహ్మద్ అల్ షాబీ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సమీపంలోని ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇస్తున్న వసతి సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటుండగా, రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్ (టీస్పోర్ట్స్ క్లబ్), సౌదీ అరేబియా (ఆల్ నూర్ క్లబ్), ఖతార్ (అల్ అరబీ క్లబ్), కువైట్ (అల్ ఖుదిసియా క్లబ్), గ్రూప్‌బ్ఖిలో కువైట్ (అల్ కువైట్ క్లబ్), సౌదీ అరేబియా (అల్ సఫా), ఇరాన్ (మిస్ కిర్మాన్ క్లబ్), బెహయిన్ (అల్ నజ్మ క్లబ్), ఖతార్ (అల్ వక్రా క్లబ్) చోటు దక్కించుకున్నాయి. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి రెండు జట్లు నాకౌట్ పోటీలకు అర్హత సాధించనున్నాయి.
క్లబ్ ఛాంపియన్‌షిప్‌లే కారణం
డ్రా కార్యక్రమం ముగిశాక భారత హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. క్రికెట్, సాకర్ క్రీడలు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం క్లబ్ ఛాంపియనషిప్‌లే అని చెప్పారు. భారత్‌లో హ్యాండ్‌బాల్‌కు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చేందుకు ఈసారి ఆసియా హ్యాండ్‌బాల్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోటీలకు వారం రోజుల ముందే టీమ్‌లన్నీ హైదరాబాద్ చేరుకోనున్నాయని, యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర క్రీడా మంత్రిత్వశాఖలు, సాయ్, శాట్స్ సహకారంతో ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామని జగన్ మోహన్ రావు చెప్పారు. కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్ పాండే, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జాతీయ హ్యాండ్‌బాల్ కోచ్ రవి, గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ నందకిశోర్ గోకుల్ తదితరులు పాల్గొన్నారు.
Srorts: ఆసియా హ్యాండ్‌బాల్ కౌంట్‌డౌన్ షురూ.. ముగిసిన డ్రా కార్యక్రమం
Advertisement
తాజా వార్తలు
Advertisement