చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత క్రీడాకారులు నేడు కూడా పతకాల వేట కొనసాగిస్తున్నారు.. నేడు జరిగిన సెయిలింగ్ పోటీలలో వెండి, కాంస్య పతకాలు మన సెయిలర్స్ గెలుచుకున్నారు.. సెయిలింగ్ డింగీ 4 క్యాటగిరి మహిళల విభాగంలో భారత్ కు చెందిన17 ఏళ్ల నేహా ఠాకూర్ వెండి మెడల్ ను కైవసం చేసుకుంది.. ఇక పురుషుల విండ్ సర్పర్ విభాగంలో మన దేశానికి చెందిన ఇబాద్ అలి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు..
సెయిలింగ్లో భారత్కు ఇదే తొలి మెడల్ అందించిన నేహా ఠాకూర్ రైతు కుటుంబం కావడం విశేషం.. హాంగ్జౌలోని గర్ల్స్ డింగీ – ఐఎల్సీఏ 4 కేటగిరీలో పోటీ పడిన నేహా.. 11 రేసులలో 27 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. థాయ్లాండ్కు చెందిన ఖున్బూంజన్ 16 పాయింట్లతో స్వర్ణం నెగ్గగా సింగపూర్కు చెందిన కీరా మేరీ కార్లిల్ 28 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకుంది.
రైతు బిడ్డ..
నేహాది వ్యవసాయం కుటుంబం. మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లా హట్పిపలియా తహసీల్ లోని అమ్లతాజ్ ఆమె స్వగ్రామం. నేహా తండ్రి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పట్నుంచి సెయిలింగ్ ఆటపై ఇంట్రెస్ట్తో వివిధ విభాగాలలో తన రాష్ట్రంతో పాటు దేశం తరఫున కూడా ప్రాతినిథ్యం వహించింది. భోపాల్లో ఉన్న నేషనల్ సెయిలింగ్ స్కూల్లో ఆమె శిక్షణ పొందుతోంది. గతేడాది మార్చిలో అబుదాభి వేదికగా జరిగిన ఆసియన్ సెయిలింగ్ ఛాంపియన్షిప్లో భాగంగా నేహా.. రితికా దంగితో కలిసి కాంస్యంతో పాటు స్వర్ణం కూడా నెగ్గింది. అక్కడ పతకం నెగ్గడంతో ఆమె ఆసియా క్రీడలకు క్వాలిఫై అయింది.
నేహా పతకం సాధించడంతో 19వ ఆసియా క్రీడలలో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. అలాగే పురుషుల విండ్ సర్పర్ విభాగంలో మన దేశానికి చెందిన ఇబాద్ అలి కాంస్య పతకాన్ని సాధించడం తో ఆ సంఖ్య 13 కి చేరింది . ఇప్పటివరకూ భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్య పతకాలతో ఆరో స్థానంలో నిలిచింది. చైనా 70 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా (36), జపాన్ (21), ఉజ్బెకిస్తాన్ (15), హాంకాంగ్ (14) భారత్ కంటే ముందున్నాయి
..