Friday, November 22, 2024

Asian Games : ఈక్వస్ట్రియన్‌లో భార‌త్ కు బంగారు ప‌త‌కం ..

చైనా : ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌ విభాగంలో భారత్‌ బంగారు పతకం సాధించింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఈక్వస్ట్రియన్‌లో భారత్‌ స్వర్ణం కైవసం చేసుకోవడం గమనార్హం. ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడ) ఈవెంట్లో డ్రెస్సేజ్ విభాగంలో భారత్ అద్భుత విజయం సాధించింది. భారత ఈక్వెస్ట్రియన్ జట్టులోని సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్, హృదయ్ ఛెడా, అనుష్ అగర్వాలా తమ ఈక్వెస్ట్రియన్ నైపుణ్యంతో భారత్ ఖాతాలో పసిడి పతకం చేర్చారు. దీంతో భారత్ ఇప్పటి వరకు మూడు బంగారు మెడల్స్ సాధించింది.

ఇవాళ సెయిలింగ్ పోటీల‌లో భార‌త క్రీడాకారులు మూడు పతకాలు సాధించారు. తొలుత మహిళల డింగీ ఐఎల్ సీఏ4 ఈవెంట్ లో నేహా ఠాకూర్ రజతం సాధించగా, పురుషుల విభాగంలో ఎబాద్ అలీ కాంస్యం సాధించి భారత శిబిరంలో ఆనందం నింపాడు. సెయిలింగ్ లో ఆర్ఎస్-x విండ్ సర్ఫింగ్ ఈవెంట్ లో ఎబాద్ అలీ మూడో స్థానంలో నిలిచాడు. ఎబాద్ అలీ ఈ ఈవెంట్ లో 52 పాయింట్ల నెట్ స్కోరు నమోదు చేశాడు. ఇక పురుషుల డింగీ ఈవెంట్ లో విష్ణు శరవణన్ కాంస్యం నెగ్గాడు. ఐఎస్ సీఏ7 విభాగంలో విష్ణు శరవణన్ 34 పాయింట్ల నెట్ స్కోరు నమోదు చేశాడు. తాజా ఫలితాల అనంతరం, హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 15కి పెరిగింది. ఇందులో మూడు బంగారు ప‌త‌కాలు, నాలుగు వెండి ప‌త‌కాలు, ఎనిమిది కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement