భారత ఆసియా క్రీడల ఆకాంక్షలకు పెద్ద దెబ్బ తగిలింది. అథ్లెట్ హిమ దాస్ కాంటినెంటల్ ఈవెంట్ నుండి వైదొలిగినట్లు జాతీయ చీఫ్ అథ్లెటిక్స్ కోచ్ రాధాకృష్ణ నాయర్ ఇవ్వాల (బుధవారం) చెప్పారు. ఆమె ఏప్రిల్‌లో కాలి గాయాలతో బాధపడుతుందని (hamstring pull) తెలిపారు. అందువల్ల ఈ ఏడాది బిగ్-టికెట్ ఈవెంట్‌ను కోల్పోతున్నట్టు వెల్లడించారు. ఈ క్రీడలు ఈఏడాది సెప్టెంబర్‌లో హాంగ్‌జౌలో జరగనున్నాయి. 2018 జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగుపందెంలో హిమ రజతం సాధించింది.
బెంగళూరులో (ఏప్రిల్ 15న) జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి IVకి ఒక రోజు ముందు ఆమె (హిమ) గాయపడడం దురదృష్టకరం. ఆమె కాలిగాయంతో బాధపడుతోంది. వెన్నులో సమస్య కూడా ఉంది. ఇప్పుడు వైద్య పరిశోధన కొనసాగుతోంది. చికిత్స కోసం ప్లాన్ చేస్తోంది. అందుకని, ఆమె ఆసియా క్రీడల్లో పాల్గొనలేరని నేను నమ్ముతున్నా అని జాతీయ అంతర్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌కు ముందు నాయర్ మీడియాతో చెప్పారు.
నీరజ్ చోప్రా, అవినాష్ సాబ్లే మినహా మిగతా భారతీయ అథ్లెట్లు ఆసియా క్రీడల కోసం భువనేశ్వర్‌లో ప్రారంభమయ్యే చాంపియన్‌షిప్‌లలో పాల్గొనవలసి ఉంటుందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఛాంపియన్‌షిప్ సందర్భంగా నాడా అధికారులు ‘ఇన్ కాంపిటీషన్’ పరీక్షను నిర్వహిస్తారని కోచ్ చెప్పారు. శిక్షణ సమయంలో కండరాలు పట్టేసిన నీరజ్ ప్రాక్టీస్ ప్రారంభించాడని, అయితే ఇంకా పూర్తిగా కోలుకోలేదని కోచ్ తెలిపారు.