Friday, November 22, 2024

ఎమర్జెన్నీ ఉన్నా ఆసియా కప్‌ నిర్వహిస్తాం : శ్రీలంక క్రికెట్‌ బోర్డు

ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అత్యయిక పరిస్థితి అమల్లో ఉంది. కఠిన ఆంక్షలతో దేశమంతా నిర్బంధంలోకి వెళ్లింది. అయినా శ్రీలంక వేదికగా జరుగబోయే క్రికెట్‌ టోర్నమెంట్‌లను కచ్చితంగా నిర్వహించి తీరుతామని శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీబీ) స్పష్టం చేసింది. శనివారం (జులై 16) నుంచి ప్రారంభం కానున్న పాకిస్తాన్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌తోపాటు, ఆసియా కప్‌ టోర్నమెంట్‌ కూడా నిర్వహిస్తామని వెల్లడించింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డు కార్యదర్శి మోహన్‌ డి సిల్వ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ… ”ఆసియా కప్‌ శ్రీలంకలోనే జరుగుతుందన్న నమ్మకం మాకుంది. మేము ఇటీవలే గాలేలో ఆస్ట్రేలియా సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించాం. పాకిస్తాన్‌ సిరీస్‌ను కూడా అదేవిధంగా విజయవంతం చేస్తాం” అని పేర్కొన్నాడు. ఆసియాకప్‌ వేదికను శ్రీలంక నుంచి బంగ్లాదేశ్‌కు మార్చేందుకు ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సన్నాహాలు చేస్తున్నదని వస్తున్న వార్తల నేపథ్యంలో డి సిల్వ పైవిధంగా స్పందించారు. తమ దేశంలో ఎమర్జెన్సీ ఉన్నా క్రికెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదన్నాడు. అయితే శ్రీలంక ఎంత చెబుతున్నా అక్కడ పరిస్థితులపై ఇతర దేశాలు మాత్రం లంకలో ఆసియా కప్‌ నిర్వహణపై మాత్రం పెదవి విరుస్తున్నాయి. రిస్క్‌ తీసుకోవడం ఎందుకు? అనే ఆలోచనా ధోరణితో ఆయా క్రికెట్‌ బోర్డులున్నాయి.

ఆసియాకప్‌ టోర్నీ షెడ్యూల్‌ ప్రకారమైతే ఆగస్టు 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ టోర్నీకి భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌లు అర్హత సాధించాయి. ఆరో జట్టు కోసం హాంకాంగ్‌, కువైట్‌, సింగపూర్‌, యూఏఈలు క్వాలిఫికేషన్‌ మ్యాచులు ఆడతాయి. ఆగస్టు 20 నుంచి 26 వరకు ఇవి సాగుతాయి. ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో కాకుండా టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement