కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ 2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. మియామీలో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. నిర్ణీత సమయం (90 నిమిషాలు) ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో 25 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు.
ఎక్స్‌ట్రా టైమ్‌లో 15 నిమిషాలు ముగిసినప్పటకీ ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. 112వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినేజ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దీంతో 1-0తో అర్జెంటీనా విజేతగా నిలిచింది. 23 ఏళ్ల తర్వాత ఫైనల్‌లో అడుగుపెట్టిన కొలంబియాకు నిరాశ తప్పలేదు.
మెస్పీకి ఘనమైన వీడ్కొలు..
అర్జెంటీనా టీమ్ ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సికి ఘనమైన వీడ్కోలు పలికింది. మెస్సికి ఇదే చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్. అయితే ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషం వరకు మెస్సి మైదానంలో లేడు. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో కుడికాలి చీలమండకు గాయం కాగా.. ఫిజియోలు వచ్చి చికిత్స అందించారు.
నొప్పి ఉన్నప్పటికీ మెస్సి ఆటను కొనసాగించాడు. రెండో అర్ధ భాగం మొదలైన కాసేపటికి నొప్పి మరింత తీవ్రం కావడంతో మెస్సి మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాడు. చివరకు అర్జెంటీనా విజయం సాధించడంతో మైదానంలోకి వచ్చిన మెస్సి.. సహచర ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.