ఇండియా వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ.. మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. నేడు జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్ బోపన్న-ఎబ్డెన్ 6-3 (3/7), 6-3, 10–6తో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్లు ఇవాన్ డుడిగ్ (క్రొయేషియా)-ఆస్టిన్ క్రాజిసెక్ (అమెరికా)పై గెలిచారు. హోరాహోరీగా సాగిన టైటిల్ ఫైట్‌లో బోపన్న జంటకు తొలి సెట్లో గట్టి పోటీ ఎదురైంది. డుడిగ్-క్రాజిసెక్ బలమైన సర్వీస్‌లతో చెలరేగారు.
దీంతో స్కోరు సమం కావడంతో టైబ్రేక్‌లో ప్రత్యర్థులు సెట్‌ను నెగ్గారు. కానీ రెండో సెట్ నుంచి బోపన్న-ఎబ్డెన్ వ్యూహాత్మకంగా ఆడారు. ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు బలమైన బేస్‌లైన్ గేమ్‌తో ఆకట్టుకున్నారు. రెండో గేమ్‌లో మూడుసార్లు డుడిగ్-క్రాజిసెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచారు.
నిర్ణయాత్మక మూడో సెట్లో రెండు జంటలు పోటాపోటీగా తలపడినా చివర్లో వరుస పాయింట్లతో బోపన్న ద్వయం సెట్‌ను, మ్యాచ్‌ను గెలుచుకుంది. మ్యాచ్ మొత్తంలో బోపన్న-ఎబ్డెన్ 6 ఏస్‌లు, 6 డబుల్ ఫాల్ట్స్ చేశారు. క్రాజిసెక్ జోడీ 3 ఏస్‌లు, 3 డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఆరు బ్రేక్ పాయింట్లతో బోపన్న జోడీ రెండింటిని కాచుకుంది.