ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న అండర్సన్… ఈ వేసవి సీజన్లో టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నాడు. ఈ ఏడాది జులైలో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు అనంతరం తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అండర్సన్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా జేమ్స్ అండర్సన్ వెల్లడించాడు.
”ఈ వేసవిలో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే మొదటి టెస్ట్ చివరిది. 20 ఏళ్లకు పైగా స్వదేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. తానెంతో ఇష్టపడే ఆటకు వీడ్కోలు పలుకుతుండడం చాలా బాధగా ఉంది. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో జేమ్స్ రాసుకొచ్చాడు.
ఇక అండర్సన్‌కు వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. 2003 లార్డ్స్ మైదానం వేదికగా జేమ్స్ అండర్సన్ క్రికెట్ కెరీర్ ఆరంభమైంది. అదే మైదానంలోనే జులైలో వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో అంటే తన 188 టెస్ట్‌లో రిటైర్మెంట్ ప్రకటించనున్నారు. 41ఏళ్ల అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన బౌలర్లలో మూడో క్రికెటర్.
800 వికెట్లతో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అండర్సన్ ఇప్పటి వరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు.