Tuesday, November 19, 2024

Paris | ఒలింపిక్స్ లో అమెరికా, చైనా ఢీ !

ప్రపంచ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న అమెరికా, చైనాలు క్రీడల్లో కూడా తమ గుత్తాధిపత్యం కోసం పోటీప‌డుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ఒలింపిక్స్‌లో అమెరికాదే ఆధిపత్యం. మొదటి నుంచి అమెరికాకు పతకాల్లో రష్యా గట్టి పోటీనే ఇచ్చింది. 2000 నుండి, చైనా రేసులోకి వ‌చ్చి… అమెరికాను బలంగా ఢీకొంటోంది. పారిస్‌లో కూడా ఈ రెండు దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమ అథ్లెట్లపై ఐవోసీ నిషేధం ఉండడంతో రష్యా కేవలం 15 మంది అథ్లెట్లనే బరిలో దించడం కొన్ని ఈవెంట్లలో అమెరికా-చైనాలకు కలిసొచ్చింది.

పతకాల పట్టికలో ఆరంభంలో చైనా ఆధిపత్యం కొనసాగింది. స్విమ్మింగ్‌ మొదలైన నాటి నుంచి అమెరికా వేగంగా రేసులోకి వచ్చింది. ఈతలో యుఎస్‌ మొత్తం 28 పతకాలు (8 స్వర్ణాలు, 13 రజతాలు, 7 కాంస్యాలు) కైవసం చేసుకుంది. ఇప్పటికే ఈ దేశం పతకాల్లో సెంచరీ (111) కొట్టేసింది.

చైనా (83) తర్వాతి స్థానంలో ఉంది. స్వర్ణాల్లో అమెరికా, చైనాలో స‌రిస‌మానంగా సాధించాయి. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటికి 48 పతకాలే గెలిచిందంటే అమెరికా-చైనా జోరును అర్థం చేసుకోవచ్చు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ పోటీలు ఆఖరి దశకు చేరడంతో అమెరికా తన పతకాలను మరింత పెంచుకునే అవకాశాలున్నాయి.

అయితే స్వర్ణాల విషయంలో అమెరికాకు చైనా గట్టిపోటీ ఇవ్వడానికి డైవింగ్, షూటింగ్‌ ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. డైవింగ్‌లో చైనా ఏడింటికి ఏడు స్వర్ణాలు కొల్లగొట్టింది. ఇక రష్యా లేకపోవడంతో ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌లో డ్రాగన్‌ దేశం హవా కొనసాగించింది.

ఈ క్రీడలో అమెరికా రెండో స్థానానికే పరిమితమైంది. షూటింగ్‌లో అయితే చైనా ఆశ్చర్యకర ప్రదర్శన చేసింది. 5 స్వర్ణాలతో సహా 10 పతకాలు (2 రజతాలు, 3 కాంస్యాలు) ఖాతాలో వేసుకుంది. కానీ గొప్పగా పుంజుకున్న అమెరికా పోటీల 13వ రోజు ఆఖరికి పతకాల్లో మూడంకెలు దాటింది. అథ్లెటిక్స్‌తో పాటు మోడ్రన్‌ పెంటాథ్లాన్, సైక్లింగ్, బాస్కెట్‌బాల్, వాటర్‌పోలో, వాలీబాల్‌ విభాగాల్లో అమెరికా పతకాలపై కన్నేసింది.

- Advertisement -

డైవింగ్‌లో చైనా క్లీన్‌స్వీప్‌

సెయింట్‌ డెన్నిస్‌: డైవింగ్‌లో తనకు తిరుగులేదని చైనా మరోసారి నిరూపించుకుంది. అందుబాటులో ఉన్న 7 స్వర్ణాలను కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. మహిళల 3 మీటర్ల స్ప్రింగ్‌ బోర్డ్‌లో చెన్‌ యీవెన్‌ (376 పాయింట్లు) స్వర్ణం కైవసం చేసుకుంది. మాడిసన్‌ కీనీ (ఆస్ట్రేలియా, 343) రజతం గెలవగా.. చైనా అమ్మాయి చాంగ్‌ (318.75) కాంస్యం నెగ్గింది.

మహిళల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌ ఈవెంట్‌ను గత పది ఒలింపిక్స్‌లో చైనానే గెలవడం మరో విశేషం. 1984 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ నుంచి డైవింగ్‌లో డ్రాగన్‌ దేశానికి ఎదురేలేకుండా సాగుతోంది. 71 స్వర్ణాల్లో 54 ఆ దేశమే గెలుచుకోవడం ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి చైనా జోరు ఇంకా పెరిగింది.

39 స్వర్ణాల్లో 34 ఆ దేశం సొంతమయ్యాయి. ప్రస్తుత క్రీడల్లో చైనా 7 ఈవెంట్లలో 10 పతకాలు (2 రజతాలు, ఒక కాంస్యం సహా) గెలిచింది. ఈ విభాగంలో బ్రిటన్‌ (1 రజతం, 3 కాంస్యాలు) తర్వాతి స్థానంలో ఉంది. పతకాల్లో చైనాకు గట్టిపోటీదారు అయిన అమెరికా డైవింగ్‌లో ఒక్క పతకమే (కాంస్యం) గెలవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement