ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్.. యూకేలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇదంతా ఐపీఎల్‌లో ఆడేందుకే ఆమీర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ లో ఉండటం ద్వారా బ్రిటీష్ సిటిజన్‌షిప్ కోసం ఈ పేసర్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అతని ప్రయత్నాలు ఫలిస్తే..? అప్పుడు ఐపీఎల్‌లో ఆడేందుకు మార్గం సుగుమంకానుంది. భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు దెబ్బతినడంతో గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లోకి పాక్ క్రికెటర్లని బీసీసీఐ అనుమతించడం లేదు.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన తర్వాత యూకేకి వెళ్లిపోయిన అమీర్.. అక్కడే తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. తాను కనీసం 6-7 ఏళ్లు క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నానని… ఈ మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ ఆడటానికి ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తున్నా. బ్రిటీష్ సిటిజన్‌షిప్‌ని భవిష్యత్‌లో తప్పకుండా తీసుకుంటా’’ అని అమీర్ వెల్లడించాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా ఇలానే బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని.. ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ తరఫున గతంలో మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌలర్లకి.. మరీ ముఖ్యంగా.. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లకి మంచి డిమాండ్ ఉంది.