Monday, September 16, 2024

Aman Sehrawat | అమ‌న్‌కు ఓవ‌ర్ వెయిట్ దెబ్బ‌..

ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో.. మరో రెజ్లర్ అమన్‌ శెరావత్ విషయంలో మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. కాంస్య పోరు కోసం బరిలోకి దిగిన అమన్.. బరువుపై శ్రద్ధ తీసుకొన్నట్లు రెజ్లింగ్‌ వర్గాలు తెలిపాయి. సెమీస్‌లో ఓటమి తర్వాత గత గురువారం నాడు అమన్‌ బరువు 61.5 కేజీలు ఉందట.

దీంతో కాంస్య పోరు (శుక్రవారం రాత్రి) నాటికి 57 కేజీలకు వచ్చేందుకు కఠినంగా శ్రమించాడు. కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు. దానికోసం సీనియర్‌ కోచ్‌లు జగమందర్ సింగ్, వీరేందర్ దహియాతోపాటు మరో ఆరుగురి బృందం కష్టపడింది. దానిని ఓ మిషన్‌లా తీసుకొని పనిచేశారు.

గురువారం రాత్రి 6.30 గంటలకు అమన్‌ సెమీస్‌లో తలపడ్డాడు. ఆ బౌట్‌లో ఓటమిని చవిచూశాడు. దీంతో కాంస్య పోరులో తలపడే అవకాశం మాత్రమే ఉంది. అందుకోసం శుక్రవారం ఉదయం అమన్‌ బరువును తూచారు. సరిగ్గా 10 గంటల సమయం మాత్రమే ఉంది.

భారత బృందం అమన్‌ను గంటపాటు వేడినీళ్ల స్నానం, ఆగకుండా గంటసేపు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్‌ చేయించి జిమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ కఠినమైన కసరత్తులు చేయించారు. మళ్లీ 30 నిమిషాల బ్రేక్‌ ఇచ్చారు. దాదాపు ఐదు సెషన్లపాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్‌ చేయించారు. చివరి సెషన్‌ నాటికి 900 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు కోచ్‌లు గుర్తించారు.

దీంతో నెమ్మదిగా జాగింగ్‌ చేయమని అమన్‌కు సూచించారు. ఇలా 15 నిమిషాలు చేయించారు. అప్పుడు సమయం శుక్రవారం ఉదయం 4.30 గంటలు. అప్పటికి అమన్‌ బరువు 56.9 కేజీలకు చేరాడు. అంటే తాను పోటీ పడిన వెయింట్‌ (57కేజీలు) కంటే వంద గ్రాములు తక్కువే ఉన్నాడు.

- Advertisement -

దాంతో భారత బృందం ఊపిరిపీల్చుకుంది. ఈ సమయంలో నిద్ర కూడా పోలేదని అమన్ తెలిపాడు. రెజ్లింగ్‌కు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉండిపోయినట్లు చెప్పాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం గెలిచిన అతి పిన్న వయసు భారత అథ్లెట్‌గా అమన్ (21 ఏళ్ల 24 రోజులు) చరిత్ర సృష్టించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement